షావుకారు చెంగయ్య ( షావుకారు -1950)
షావుకారు చెంగయ్య అంతర్ముఖుడు. కొడుకు పట్నంలో చదువుకుంటున్నాడు. వేరే కుటుంబ సభ్యులు లేరు. మనసుపంచుకునే మనుషులతనికి లేరు. అతని స్వభావం దానికి దోహదపడినట్టుంది. ఆ అంతర్ముఖీనత అతనిని ఒంటరిని చేసింది. అతనికి కొద్దిగా దగ్గరికి రాగలిగింది పక్కింటి రామయ్య కూతురు సుబ్బులు మాత్రమే. స్వార్ధరహితమైన ఆపేక్ష చూపే ఆ పిల్లకి చెంగయ్యను మేలమాడే చనువు వుంది. ఐతే చెంగయ్య చెలిమి చేసింది మాత్రం తన సంపదతోనే. ఆ సంపద ఆర్జించే క్రమంలో అయిష్టత చూపుతూనే దొంగసొత్తును కొనటం వంటి చట్టబద్ధంకాని పనులు చేయగలడు.బాకీ వసూళ్ళకు సున్నం రంగని వంటి రౌడీని ఉపయోగించుకోగలడు.తనకు చట్టబద్ధంగాలేని హక్కుతో తనపూర్వీకులు కట్టించిన సత్రాన్ని వ్యాపారవినియోగం కోసం అద్దె కు ఇవ్వగలడు.
ఆ విషయంలో పోలీసు విచారణలో ఆ సత్రంపై తనకు హక్కు ఉందని వాదించాడు. తనకు పొరుగువాడు, భవిష్యత్తులో వియ్యంకుడు కాబోయే రామయ్య సాక్ష్యం వేసుకున్నాడు. రామయ్య తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వటంతో భగ్గుమన్నాడు. పొరుగింటితో తెగతెంపులు చేసుకున్నాడు.అందుకు కొడుకుకు కోపంవచ్చి వెౡపోయినా పట్టించుకోలేదు.రామయ్యనుండి రావలిసిన బాకీకి చెల్లురాయకుండా ఎక్కువ వసూలు చేసాడు. రామయ్య కొడుకు సత్యం పై తప్పుడుకేసు బనాయించి జైలు పాలు చేసాడు. ఈ గొడవలన్నింటిలో మిగతావారిపాత్ర ఎంతవున్నా అతనే వాటికి బాధ్యుడు.
తర్వాత తనకొడుకు తప్పుడు కేసువల్ల జైలుపాలయ్యాడు. తన పట్లకోపంతో వకాలతుకు కూడా ఒప్పుకోకుండా శిక్ష అనుభవిస్తున్నాడు.
చెంగయ్యలో అంతర్మధనం ప్రారంభమయ్యింది. సున్నంరంగణ్ణి దూరం పెట్టాడు. రంగడు మనుషులతో దోపిడీకివచ్చి హింసించినా తాళంచెవులజాడ చెప్పలేదు. సుబ్బులుని హింసించబోయేసరికి మాత్రం అతని మనసు కరిగింది.
అతని చర్యలు సమర్ధనీయం కావు. అతన్ని తప్పుపట్టకుండా వుండలేము. ఐనా అతని పట్ల సానుభూతి కలుగుతుంది. దానికి కారణం ఆ పాత్రను రూపొందించిన విధానం. అతను దుర్మార్గుడా?మానవత్వం లేనివాడా?లోభా? ...ఇవన్నీ అతనిలో ఎంతో కొంత ఉన్నాయి..వీటన్నిటితో కూడిన సహజమైన మనిషి. మనకు తెలిసిన అనేకమందిలో చెంగయ్యను చూడగలం.
నెగెటివ్ పాత్ర , అందునా వయసు మళ్ళిన పాత్ర కు చెందిన షావుకారు అనే పేరు ఆ సినిమాకుపెట్టారు.. ఒక రకంగా ఆ సినిమా లో నాయకుడు,ప్రతినాయకుడూ షావుకారు చెంగయ్యే. అతని తర్వాత గుర్తుండే పాత్రలు సుబ్బులు,రామి, సున్నం రంగడు, పంతులు. దీనికి కారణం ఆ పాత్రల్లోనూ, పాత్రపోషణలోనూ ఉన్న సహజత్వమే.
విభిన్న మానసిక స్థితి గతుల్ని ప్రతిబింబిస్తూ చెంగయ్య పాత్ర ను గోవిందరాజుల సుబ్బారావు పోషించిన తీరు అసామాన్యం. పాత్రను వెనక్కునెట్టి నటుడు ముందుకు రాడు..అతని కదలికలు, హావభావాలు, సంభాషణ పలికే తీరులో ఎక్కడా నాటకీయత ఉండదు. షావుకారు చెంగయ్యను, గోవిందరాజుల సుబ్బారావు ను వేరుగా చూడలేము
షావుకారు సినిమా డెబ్భై ఏళ్ళకు మునుపు ఉన్న కోస్తాప్రాంతపు, ప్రత్యేకంగా తెనాలి చుట్టుపక్కల గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. సహజత్వానికికి చాలాదగ్గరగాఉంటుంది. ఆ సహజత్వం తెలుగుసినిమా భరింపలేనిలంతది. నిర్మాతలలో ఒక్కరైన చక్రపాణి సినిమాకు సంభాషణలు,స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా విజయవంతం కాకపోవటం వల్ల వారి తర్వాత సినిమాల పంథా మారింది.
-ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment