పింపళ్ ( రావి చెట్టు) - మరాఠీ సినిమా:(2017)
వృద్ధాప్యం, ఒంటరితనం, ఆత్మీయులకు దూరంగా వుండటం మనిషిని బాధిస్తాయి. ఇంటిబెంగ (హోమ్ సిక్), గతంపట్ల బెంగ (నోస్టాల్జియా), గతకాలపు అసంపూర్ణ కార్యాలు ఆ బాధను పెంచుతాయి. వీటిని అధిగమించటానికి ఆధునిక సాధనాలు ఎంతమేరకు సాయపడుతున్నాయి. వాటిద్వారా సృష్టించబడే వర్చువల్ ప్రపంచం మనిషి మనుసును స్పృశించగలుతుందా? - ఈ సబ్జెక్ట్ తో సినిమా సాగుతుంది.
****
అరవింద్ సముద్రానికి చేరువలో ఉన్న పల్లె లో పుట్టాడు. సాంప్రదాయబద్ధమైన ఉమ్మడి కుటుంబం. గృహసముదాయమనదగ్గ పరిమాణంలో ఉన్న ఇల్లు. పదులసంఖ్యలో ఉన్న కుటుంబసభ్యులు. ప్రాంగణం లో సామూహిక భోజనాలు, హరిసంకీర్తనలు, నృత్యప్రదర్శనలు, దానధర్మాలు , బైట కుస్తీపోటీలు, ఆటపాటలు ..వీటన్నింటితో బాల్యాన్ని అస్వాదించాడు.
బడి లో చేరి ఇంటికి దూరమైనపుడు, సముద్రంపొగి వరద రావాలని కోరుకొనేవాడు. ఆ వరదలో బడికి చెందిన చెక్కబల్లపై తేలుతూ ఇంటికి చేరుకోవాలనేది అతని కోరిక.
తర్వాత ఇంజనీరింగ్ చదివాడు. ఇంటికి ఇంకా దూరమయ్యాడు. సీమా ను పెఌచేసుకున్నాడు. పిల్లలల్తో సొంతకుటుంబం ఏర్పడింది. నగరంలో స్థిరపడ్డాడు. పిల్లలు పెరిగి విదేశాలలో స్థిరపడ్డారు. భార్యతో రిటైర్డ్ జీవితం గడుపుతుండగా భార్య మరణించింది. ఖరీదైన కమ్యూనిటీ లోని అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో గతపదేళ్ళుగా అరవింద్ ఒక్కడే జీవిస్తున్నాడు.
అతనికి దిన చర్య చాలాసరళమైనదే. ఉదయం లేచి కాఫీ చేసుకుని తాగుతాడు. చక్కని ట్రాక్ సూట్ వేసుకుని పచ్చదనంతో నిండిన విశాలమైనమైదానానం లో జాగింగ్ వంటి వాకింగ్ చేస్తూ ,ట్రాక్ పక్కనున్న బల్లపై కూరుంటాడు. వంటమనిషి తయారుచేసిన భోజనం చేస్తాడు. స్కైప్ ద్వారా విదేశం ఉన్న మనుమలతో కొద్దిచేపు మాట్లాడతాడు. వాళ్ళకు ఇక్కడి ప్రపంచాన్ని, తన బాల్యపు ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం చేస్తాడు. మనుమరాలి సంగీతసాధనను ఆస్వాదిస్తాడు.పక్కపైన చేరి ఇక్కడలేని భార్యతో సంభాషిస్తూ ఉంటాడు.
ప్రత్యక్షంగా ఇక్కడ అతనికి ఉన్న సంబంధం ఇద్దరు వ్యక్తులతోనే. ఒకరు సుమారు పాతికేళ్ళ వయసున్న డాక్టరు మేఘన. ఈమె అతనికి ఆరోగ్యసలహాదారే కాదు, స్నేహితురాలు కూడా. మరొకరు అతని వంటమనిషి తుకారాం.అతనితో అరవింద్ ప్రేమ తగువు రూపంలో వ్యక్తమౌతూవుంటుంది.
వర్చువల్ ప్రపంచంలో అతనికి తనవాళ్ళందిరితోనూ సంబంధకొనసాగుతుంది. నిత్యం మనుమలతో సంభాషిస్తున్నాడు. కొడుకులు కోడళ్ళూ విసుగు చూపకుండా మాట్లాడుతున్నారు. తన పుట్టినరోజును కుటుంబసభ్యులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి ఘనంగా జరపటాన్ని అతను ఆన్ లైన్ లో ఆనందం గా వీక్షించాడు.పిల్లలు తనని అక్కడి వచ్చెయ్యమన్నపుడల్లా మాట దాటవేస్తుంటాడు.
అరవింద్ కు సంబంధించిన వ్యక్తులంతా మంచివారు. అందరూ అతన్ని అభిమానించే వారే, గౌరవించేవారే. ఆర్ధికపరంగా ఏమాత్రం సమస్యలు లేవు. ఒక్క భార్యావియోగం మినహా సాధారణ దృష్టి లో అరవింద్ చాలా అదృష్టవంతుడు గా పరిగణింపబడతాడు.
ఒంటరితనం అతని సమస్య. . మరణించిన భార్యతో సంభ్హాషిస్తున్నట్టు తనతో తానే మాట్లాడుకుంటుంటాడు.
అతని అంతరంగం ఇలా ఉంది.
“వర్చువల్ ప్రపంచం .. అన్నీ ఉన్నట్ట్టే ఉంటుంది. వాసన లేదు, రుచి లేదు, ఫీలింగు ఉంది కాని స్పర్శ లేదు”
“ముగింపు దగ్గరలోనే ఉంది. జీవిత యాత్ర సాగుతునేఉంది.”
“ వింటేజ్ కార్లకు విలువ కొనసాగుతుంది కదా!”
“జీవితం పండుటాకులా రాలింది. ఎండిన ఈనెల వలలా జీవితం ఉంది. పిల్లలు, మనుమలు ఈ పండుటాకును పుస్తకంలో జాగ్రత్త చేయాలని ఆశిస్తారు.ఎండిన ఆకు శ్వాసించగలదా? ఏ చెట్టుకోసం రాలిన ఆకు శ్వాసించాలి. ఆకు ఇప్పుడు భూమికోసం ఎదురు చూస్తుంది. భూమిలో కలవాలని కోరుతుంది.”
*****
ఆరోగ్యంలో పొడసూపిన మార్పులతో పిల్లల బలవంతం తో అరవింద్ అమెరికా ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టాడు.తుకారాం బజారు నుండి తెచ్చిన సూట్ కేస్ తన అవసరాలకు చాలదని చెప్పాడు.
తను తీసుకెళ్ళదలచిన వస్తువులసేకరణ మొదలు పెట్టాడు.
పిల్లలు బాల్యంలో చదివిన పుస్తకాలు, వాళ్ళకు వచ్చిన మెడల్స్, ట్రోఫీలు, వారి ఆటబొమ్మలు, భార్య ఉపయోగించిన ట్రాన్సిస్టరు, ఆమె నగలపెట్టె, ఆమె దాచుకున్న చీరలు, అన్నింటిని ఒకచోటచేర్చాడు.
ఆ సందర్భంలో తన డాక్టర్ స్నేహితురాలు తో సంభాషణ:
“ వీటన్నింటిని తీసుకెళదామనుకుంటున్నావా?”
“ఔను!”
“ఈ ఫొటో ఆల్బమ్ కూడానా?”
“అందులో నా స్మృతులెన్నో దాగిఉన్నాయి.సీమా వెఌపోయిన పదేళ్ళనుండీ నేను వాటితోనే జీవిస్తున్నాను. ఈ వస్తువులే నన్ను బ్రతికించి ఉంచాయి.,ఇప్పుడు వాటిని వదిలి ఎలా వెళ్ళగలను?”
“ఇక్కడనుండి నువ్వు యు ఎస్ వెళుతున్నావు, అక్కడినుండి ను స్వర్గానికి వెళతావు. అప్పుడు నువ్వు అక్కడనుండి వీటన్నిటినీ నీతో తీసుకెళ్ళలేవు.వీటినిక్కడే వదిలివెళ్ళవచ్చుగా?
“స్వర్గానికి వెళ్ళేటపుడు ప్రాణాలతో ఉండను. కాని యు ఎస్ ప్రాణాలతోనే వెళుతున్నాను. ప్రాణమున్నంతవరకు ఫీలింగ్స్ ఉంటాయి. అంచేత ఈ వస్తువులకు రిలవన్స్ ఉంది.”
ఈ చీరలో సీమా లేదంటావా? పిల్లలు అమెరికా వెఌపోయారు. కాని వారి బాల్యం ఈ ఆటబొమ్మలలోనూ ,మెడల్స్ లోనూ లేదంటావా? ఐనా ఇవన్నీ వాళ్ళవికావు. ఇవి నా పిల్లలకు చెందినవి. ఇవి వాళ్ళకు పట్టకపోవచ్చు కాని నేను వీటిని నా పిల్లలకోసం తెచ్చాను.వాళ్ళ బాల్యం వీటిలో దాగి ఉంది.
*****
అమెరికా బయలుదేరే లోపు అరవింద్ మరింతగా అంతర్లోకనానికి లోనయ్యాడు. అమెరికా చిన్న చేతిసంచితో బయలు దేరాడు. ఎయిర్ పోర్ట్ నుండి సొంతవూరికి వెళ్ళాడు. చిన్ననాటి ఇంటి శిధిలాల మధ్య ఒక రావి మొక్క నాటాడు. అది అతని తల్లి ఏ నాడో కోరిన కోరిక.
No comments:
Post a Comment