రాజమకుటం(1960)
డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగెన్’’ కు దగ్గరలో ఉన్న’ క్రోన్ బోర్గ్ కాజిల్’ ను ‘హామ్లెట్ కాజిల్’ అని కూడా అంటారు. బాల్టిక్ సముద్రపు ఒడ్డున ఉన్న ఆ కాజిల్ కు మరో ఒడ్డున ఉన్న ‘స్వీడన్ ‘కనిపిస్తూంటుంది. ఆ కాజిల్ కథాస్థలంగా, వైకింగుల చెందిన 11వ శతాబ్దం నాటి కొన్ని చారిత్రకాంశాలకు కాల్పనికత జోడించి షేక్స్పియర్, హామ్లెట్ నాటకం రచించాడు. ‘హామ్లెట్ కాజిల్ ‘గా ఆ స్థలం ఇప్పటికీ సందర్శకులను ఆకర్షిస్తుంది. జూలై, ఆగస్ట్ నెలలలో ‘క్రోన్ బోర్ఘ్ కాజిల్’ లో హామెలెట్ నాటకంలోని కొన్ని భాగాలను, నాటకంలో వర్ణితమైన ప్రదేశాలలో ప్రదర్శిస్తుంటారు.సందర్శకులకు అదొక ప్రత్యేక ఆకర్షణ.
యువరాజు హామ్లెట్ రాజ్యం వెలుపల ఉండగా మహరాజు హత్యకు గురయ్యాడు. అతను రాజ్యానికి వచ్చేసరికి తన తల్లి జెర్ట్రూడ్ , తన చిన్నాన్న క్లాడియస్ ను పెళ్ళి చేసుకుని ఉంది. హామ్లెట్ కు చనిపోయిన తండ్రి దెయ్యంగా కనిపించి తనను తన సోదరుడే చంపాడని అతనిపై పగతీర్చుకొమ్మని, తల్లిని కాపాడమని కోరాడు. యువరాజుకు చెప్పరానంత మానసిక క్లేశం. తండ్రిన చంపిన హంతకుడు, తండ్రికి ద్రోహంచేసిన తల్లి కళ్ళెదుట కనిపిస్తున్నారు. పిన తండ్రిని అంతమొందించాలని కోరిక, దానితో పాటు ధర్మ సంకటం.
కత్తిదూసి పినతండ్రిని చంపాలని బయలు దేరాడు.అంతలోనే తండ్రి దయ్యమవటం నిజమేనా అని అనుమానం. మనుటయా? మరణించుటయా? అనే సంధిగ్ధం. వీటితో అతని మతి స్థిమితం తప్పింది.హామ్లెట్ తను అనుకున్నవి సాధించగలిగాడు. సాధించటంలో ఎన్నోకోల్పోయి ట్రాజిక్ హీరోగా మిగిలిపోయాడు.
ఈ నాటకం సినిమాగా అనేక పర్యాయాలు వచ్చింది. దానిని అనుకరించిన సినిమాలున్నాయి. అందులోని కొన్ని సంఘటనలస్పూర్తి తో రూపొందిన సినిమాలున్నాయి.తెలుగు సాహిత్యంలోనూ, సినిమాలోనూ హామ్లెట్ కనపడతాడు. రచయిత బుచ్చిబాబు , షేక్సిపియర్ సాహిత్యంపై వ్యాసాలు రాసాడు. బుచ్చిబాబు రాసిన ‘చివరికి మిగిలేది’ నవల కథానాయకుడు ‘దయానిధి’ పై హామ్లెట్ ప్రభావం ఉంది.
**********
ద్రవిడ రాజకీయవేత్త కరుణానిధి, తొలినాళ్ళలో సినిమా రచయితగా ఉన్నారు. డైలాగ్ రైటర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా పేరెన్నికగన్నాడు. ఆయన సంభాషణలు రాసిన సినిమా ‘మనోహర’( 1954) గొప్పవిజయంసాధించింది. మహరాణి - ఆమె కుమారుడు,యువరాజైన మనోహరునికి ఉన్న అనుబంధం, తల్లిని ఉపేక్షించిన తండ్రిపై యువరాజు ఆగ్రహం - సినిమాలో ప్రధాన అంశం.
మహరాణి గా కన్నాంబ, యువరాజులుగా శివాజి గణేశన్ నటించారు.
కరుణానిధి రచన, సంభాషణలు అందించిన మరో సినిమా ‘ పుదుమై పితన్’(1957). ఈ సినిమాలో యువరాజు , తనతండ్రిని చంపిరాజ్యాన్ని హస్తగతం చేసుకున్న పినతండ్రి పై కక్షసాధిస్తాడు. అందుకోసం పిచ్చివానిగా నటిస్తాడు. యువరాజుగా ఎం.జి. రామచంద్రన్ నటించారు. ఈ సినిమాపై ‘హామ్లెట్’ నాటకం ప్రభావం బాగాఉంది.
కరుణానిధి రచన చేసిన ఈ రెండు సినిమాలూ తెలుగు లో కి ‘ మనోహర’ , ‘వీరఖడ్గం’ పేరుతో డబ్బింగు అయ్యాయి.
*********
దర్శకుడు బి.ఎన్. రెడ్డి తెలుగు తెరపై గొప్ప కళాసృష్టి చేశారు. మల్లీశ్వరి సినిమా తర్వాత ‘సిలాస్ మార్నర్ ‘అధారంగా తీసిన బంగారు పాప సినిమా పేరు వచ్చినంతగా డబ్బు రాలేదు. మరోసినిమా భాగ్యరేఖ తీసాక, ఆయన తనకు కొత్తదైన ‘జానపద’ సినిమా బాట పట్టారు. తనతో ముందునుండీ పనిచేస్తున్న ‘పాలగుమ్మి పద్మరాజు’, ‘డి.వి. నరసరాజు తో సినిమా కథ రాయించారు. అలా వచ్చిన సినిమా రాజమకుటం. సినిమా కథ హామ్లెట్ పై ఆధారపడినదే. ఐతే హామ్లెట్ పైనే అధారపడి రాసిన ‘ పుదుమై పితన్ ‘ కథకు ‘మనోహర’ కథను కూడాకలిపారు. అలా ఈ సినిమా రెండు కరుణానిధి రచనచేసిన సినిమాల కలయిక అయ్యింది.
*********
బి.ఎన్. రెడ్డి నిర్మాతగానూ వ్యవహరించిన ఈ సినిమా ఆయనకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు.
జయాపజయాలను పక్కనపెడితే రాజ మకుటం సినిమా తెలుగు జానపద సినిమాలకు (ప్రత్యేకంగా మాయలు -మంత్రాలు లేనివాటికి) మకుటాయమానమైనదే. లోపరహితమైన స్క్రీన్ ప్లే, కన్నాంబ, ఎన్.టి. ఆర్, గుమ్మడి ల ఉత్తమస్థాయి నటన సినిమాకు బలం
సంగీతపరం, సాహిత్య పరంగా ఎన్నదగిన , ఇప్పటికీ వినదగిన పాటలు ‘ఊరేది? పేరేది ఓ చందమామ””’, ‘సడిసేయకో గాలి సడి చేయబోకే’,’ఏడనున్నాడో ఎక్కడున్నాడో’, ‘యేటి ఒడ్డునాన మా వూరు’ వంటివి ఉన్నాయి. దృశ్యపరంగానూ బాగాఉంటాయి.( ‘యేటిగట్టునా మా వూరు’ పాటపై సి. ఐ. డి (హిందీ) సినిమాలో ‘ భూజ్ గయా క్యా నామ్ రె ! నదీ కినారే గావ్ రే! స్పూర్తి కనపడుతుంది).
సినిమాలో బి. ఎన్. రెడ్డి అభిరుచి కనపడుతూనే ఉంటుంది. సాంకేతికంగా సినిమాలొ లోపం కనపడదు. మొత్తం మీద ఏదో లోపించినట్టు ఉంటుంది. బహుశా ఎంతోకోల్పోయిన, విషాదంతో కూడిన హామ్లెట్ జీవితాన్ని తెర పై ధీరోదాత్తుడు, విజేత ఐన కథానాయకుడు మార్చటంతో, హామ్లెట్ నాటకానికి ఆయువుపట్టైన అంతర్మధనం, సంఘర్షణ మిస్సవ్వటం ఆలోపం కావచ్చు.
No comments:
Post a Comment