Monday, August 24, 2020

బాలు మొదటి హిందీ పాట

 ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం మొదటి హిందీ పాట

ఎస్ పి  బాలసుబ్రహ్మణ్యం హిందీ సినిమాలకు పాడటం ఏక్ ధూజే కేలియే(1981) తో మొదలయ్యింది. ‘మరో చరిత్ర’  రిమేక్ గా ఎల్ వి ప్రసాద్ ,బాలచందర్, కమల్ హసన్ కాంబినేషన్ తో ఏక్ దూజే కేలియే తీసారు. ఎల్ వి ప్రసాద్ హిందీ సినిమాకు కొత్తకాదు. కానీ సినిమాను ఉత్తరభారత సినీ విమర్శకులు దక్షిణాది దండయాత్ర గా అభివర్ణించారు. బహుశా దర్శకుడు, కథానాయకుని తో పాటు ప్రధాన గాయకుడు కూడా దక్షిణాదివాడు కావటం, సినిమా విజయవంతం కావటం దానికి కారణం కావచ్చు.

 సంగీతదర్శకులు లక్ష్మికాంత్, ప్యారేలాల్ లు  బాలసుబ్రహ్మణ్యంతో పాడింపజేయటానికి  తొలుత విముఖత చూపారు. దక్షిణాదివారి హిందీ ఉఛ్ఛారణసౌతీగా ఉంటుందన్నదే వారి అభ్యంతరం.ఐతే కధానాయకుని మాతృభాష తమిళం. అతను నేర్చుకున్న హిందీ తో మిగతాపాత్రలతో సంభాషిస్తుంటాడు, పాటలూ పాడతాడు. పాత్రోచితంగా ఉంటుందనుకున్నారో ఏమో గానీ  చివరకు బాలు తో పాడించారు. పాటలు దేశప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. అప్పటికే మరో దక్షిణాది గాయకుడు జేసుదాసు తన హిందీపాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిఉన్నాడు. ఐతేజేసుదాసు ఖయ్యామ్, రవీంద్రజైన్, రాజేశ్ రోషన్ వంటి సంగీతదర్శకుల ద్వారా  వైవిధ్యమైన పాటలు పాడాడు కాని పూర్తిస్థాయి కమర్షియల్ హీరోలకు పాడినవి తక్కువ.

ఏక్ దూజే కేలియే విజయం తర్వాత కొన్ని హిందీ సినిమాలకు పాడిన పూర్తిస్థాయి విజయం అతనికిమైనె ప్యార్ కియాతో లభించింది. సినిమా సాధించిన అసాధారణ వ్యాపారవిజయంలో పాటల పాత్ర చాలాఉంది. ఆతర్వాత బాలు కమర్షియల్ సినిమాలలో పెద్దహీరోలకు, యువహీరోలకు చాలామందికి  నేపధ్యగానం చేసాడు.బాలు పాడిన హిందీ పాటలు నాలుగువందలవరకూ ఉండవచ్చు.

 

****

బాలు పాటపాడిన మొదటిసినిమాఏక్ దూజే కేలియేకావచ్చు కాని అతనుమొదటపాడిన  హిందీ పాట మాత్రం వేరే ఉంది

మంచుకొండలు’(1981?)  పేరుతో ఒక మలయాళీ సినిమా తెలుగులో కి డబ్ అయ్యింది. మిలటరీ నేపధ్యంలో సాగే సినిమాను కాశ్మీర్ తీసారు. అందులోని ఒకపాట తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. ప్రత్యేకంగా సిలోన్ రేడియోలో ( శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్వినపడేది. పాట మొదట హిందీతో మొదలై,  హిందీ - తెలుగు చరణాలతో సాగుతుంది. “ సాథీ రే ప్యార్ జవా హై! బర్ఫీలా మస్త్ జమా హై!” అంటూ ఎస్ పి బాలు స్వరంతో మొదలౌతుంది. హిందీ భాగం ఎస్ పి బాలు , తెలుగు భాగం జి. ఆనంద్ పాడారు. కశ్మీర్ మంచుకొండల్లో చిత్రింపబడిన పాట సినిమాలో నూ బాగుంటుంది. వినటానికీ బాగుంటుంది. ‘ ఖయ్యాం’ సంగీతాన్ని గుర్తుచేస్తుంది.

మంచుకొండలు మలయాళమూలంతుషారంసినిమా లో పాటను ఎస్. పి . బాలు (హిందీ), జేసుదాసు (మలయాళం) పాడారు. వీరిద్దరికాంబినేషన్ లో  అరుదుగా వచ్చినపాటల్లో ఇదొక మంచిపాటప్రధాన గాయకులస్వరంతో తో పాటు కోరస్, వాద్యసంగీతం - కశ్మీర్ లోయల్లో ప్రతిధ్వనిస్తున్నట్టే  కాదు ఎదలోయల్ని స్పృశిస్తున్న అనుభూతి కలుగుతుంది. సంగీత దర్శకుడు శ్యామ్ ( అంతిమతీర్పు సినిమాద్వారా తెలుగు వారికి పరిచితుడే)

పాట నాకు మరో రెండు పాటల్ని గుర్తుచేస్తుంది. ఒకటి  1978 లో వచ్చినఏజెంట్ గోపి’  సినిమాలో (సత్యం సంగీత దర్శకత్వం) బాలు,సుశీల పాట.. హంస బలే రామ చిలకాఐతే మరొకటి 1995 లో వచ్చిన దండోరా సినిమాలోకొండల్లో కోయిల పాటలు పాడాలిపాట.( వందేమాతరం శ్రీనివాస్ గానం

,సంగీతం).




Friday, August 14, 2020

డాన్ (1978)

  ’డాన్’(1978) #Don_amitabh

ఔర్ ఏక్ ‘డాన్’ కో బనానా ముష్కిల్ నహీ! న మున్కిన్ హై!
రక్త సంబంధీకులలో తప్ప ,అచ్చు గుద్దినట్టు ఒకరిని పోలిన మనుషులు మరొకరుండటం అసాధారణ విషయం. ఐతే సాహిత్యంలోనూ, సినిమాలలోను ఇది పలుమార్లు కనపడుతూంటుంది. ఫ్రెంచ్ విప్లవనేపధ్యంలో వెలువడి, వరల్డ్ క్లాసిక్ గా పేరుగాంచిన ‘ టేల్ ఆఫ్ టు సిటీస్’ నవలలో సైతం కథానాయకుని పోలికతో ఉన్న లాయర్ ఉండటం, వారిపోలికలు, కథను లో మలుపులకు, డ్రామాకు దోహదం చేసాయి.ఐతే మెజారిటీ సినిమాలలో ఒకరిని పోలిన ఒకరు చివరకు అన్నదమ్ములు గా తేలుతారు. అరుదుగా రక్తసంబంధీకులుకాకుండాఉంటారు.
దర్శక నిర్మాత ‘ శక్తి సామంత’ వంగదేశీయుడు. కలకత్తా నేపధ్యంతో అతను కొన్ని సిన్మాలు తీసాడు. కలకత్తాలో ఒక లాండ్ మార్క్ ఐన ‘హౌరా బ్రిడ్జ్’ పేరుతో తీసిన క్రైము సినిమా విజయంసాధించింది. తర్వాత కలకత్తాలో ఒక ప్రాంతమైన ‘ చైనాటవున్’ పేరుతో మరో నేరనేపధ్యపు సినిమా తీసాడు. సినిమాలో చెప్పనటువంటి కథ ‘చైనా టవున్’ పేరుకు ఉంది.
హక్కా (జాతి?) చైనీయులు బ్రిటీష్ యేలుబడి కాలంలో బెంగాలు ప్రాంతానికి వచ్చారు.ప్రత్యేకంగా నల్లమందు యుద్ధాలతర్వాత. ‘హక్కా’ అంటే చీనీభాష లో ‘ అతిధి’ అని అర్ధం ఉంది. కానీ అలా వచ్చిన వారు చాలామంది కలకత్తాలో స్థిరపడ్డారు. తోళ్ళపరిశ్రమ (టానరీ) లో వారు ఉపాధి వెతుక్కున్నారు. టానరీలలో పనిచేయటం మిగతావర్గాలు నీచమైనదిగా భావించటంవారికి వరమయ్యింది. టానరీలు, పాదరక్షలతయారీవంటి పనులతో పాటు ‘నల్లమందు’వ్యాపారంకూడాచేసారు.
భారత్ స్వతంత్ర దేశం అయ్యేంతవరకూ వారి వ్యాపారాలు చట్టబద్దమైనవే. వారు ఇక్కడకు వచ్చి అప్పటికి సుమారు నూటయాభైయేళ్ళు అయ్యింది. వారిసంస్కృతిప్రతిబింబిస్తూ స్కూళ్ళు, ప్రార్ధనామందిరాలతో కూడిన కాలనీలవంటివి ఏర్పడ్డాయి. ఐతే స్వాతంత్రానంతరం వారి వ్యాపారాలు కొన్ని చట్టవిరుద్ధమైనాయి. రాజకీయకారణాలతో చైనా భారత్ కు శత్రుదేశంగాను మారింది.
అలాంటి నేపధ్యంలో శక్తి సామంతా, కలకత్తా చైనాటవున్ లో ‘ చెప్పుల షాపు’ వెనుక జరిగే చీకటి వ్యాపారాన్ని ఫోకస్ చేస్తూ,ముఖ్యప్రతినాయకుని చైనీయునిగా చూపుతూ సినిమా తీసాడు. చైనా తో భారత్ యుద్ధకాలంలోనే సినిమా విడుదల అయ్యింది.
*****
‘ లీగసీ ఆఫ్ ఎ స్పై’ అనె ఇంగ్లీష్ నవల ఆధారంగా హిందీలో ఒకటిరెండు చిన్నసినిమాలు వచ్చాయి. అందులోని అంశాలకు చైనాటవున్ నేపధ్యాన్ని కలిపి శక్తి సామంతా ‘చైనాటవున్’ ప్లాన్ చేసాడు.
సినిమాలో ప్రధాన అంశం, చీకటి సామ్రాజ్యం ‘కింగ్ పిన్’ లాంటి వ్యక్తి స్థానంలో పోలీసులకు సంబంధించిన వ్యక్తిని ప్రవేశపెట్టి ఆ సామ్రాజ్యాని కూలగొట్టటం.
పోలీసులకు ప్రధాననేరస్థుడు దొరికాడు. అతనితో పోలీసులు రహస్యాలు చెప్పించలేకపోతున్నారు. అదేసమయంలో పోలీసులు ఒక వ్యక్తిని చేసారు. అతను అచ్చుగుద్దినట్టు దొరికిన నేరస్థుని పోలిఉన్నాడు. అతనిని ఒప్పించి పోలీసులు నేరస్థుని స్థానంలో ప్రవేశపెట్టారు. ఒకే పోలికతో ఉన్న ఆ ఇద్దరూ చిన్నప్పుడే విడిపోయిన అన్నదమ్ములు.
పైకథకు , సూపర్ హిట్ గీతాలు , షమ్మీ కపూర్ నటన తోడై సినిమా జనరంజకమయ్యింది.
కథలో ఉన్న యూనివర్సల్ అప్పీల్ సినిమాను దక్షిణభారతానికీ తెచ్చింది. తమిళంలో ఎమ్. జి . రామచంద్రన్ తోనూ, తెలుగులో ఎన్.టి. ఆర్( భలెతమ్ముడు) తోనూ, మళయాళంలో ప్రేమ్ నజీర్ తోనూపునర్నిర్మితమయ్యింది.
**********
ఐతే ఇది ఇక్కడితో ముగియలేదు.
చైనా టవున్ ఆధారంగా 1978 లో అమితాబ్ బచన్ హీరోగా వచ్చిన ‘డాన్’ సినిమా బొంబాయి మాఫియా నేపధ్యంలో సాగుతుంది.మాఫియా డాన్ పోలీసులకు నిద్రాహారాలు లేకుండాచేస్తున్నాడు. అతన్ని పట్టుకోవటం ఎవరివల్లా కావటం లేదు. కొన్ని ఆకస్మిక సంఘటనలతో ‘డాన్’ ఒక పోలీస్ అధికారికి దొరికాడు. మాఫియా మిగతావివరాలు చెప్పకుండానే అతను మరణించాడు. అదే సమయంలో ఆ పోలీసు అధికారికి ‘డాన్’ రూపురేఖలతో ఉన్న ఒక గ్రామీణయువకుడు కనిపించాడు.పోలీసు అధికారి అతన్ని ‘డాన్’ లా నేరప్రపంచానికి పంపాడు.
తర్వాత కథ ‘చైనాటవున్’ సినిమాలా తేలికగా ముగియలేదు.
మాఫియా లో ప్రవేశించిన వ్యక్తి , పోలీసులకు అవసరమైన కొంత పని చేసాక అతను ‘డాన్’ కాదని మిగతావారు తెలుసుకున్నారు. వారంతాఇతనిపై కక్షకట్టారు. ఒక్క పోలీసు అధికారికి తప్ప ఇతను’ డాన్’ కాడని మిగతా పోలీసులకు తెలియదు. వారంతా ఇతనిని డాన్ గానే భావిస్తున్నారు. అంతలో ఆ పోలీసు అధికారి మరణించాడు. ‘ డాన్’ రూపంలో ఉన్న యువకుడికి ఎటునుండీ రక్షణలేదు.అతను ఎలాబయటపడ్డాడన్నది తర్వాత కథ.
1978 ‘ డాన్’ సినిమా హైదరాబాద్ ‘taarakaraamaa ’థియేటర్ లో 75 వారాలపాటు నడిచింది . అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు. సినిమాలో అమితాబ్ నటన బాగాపండింది. పాటలు గొప్ప జనాదరణపొందాయి. వీటన్నింటితో పాటు సినిమా అసాధారణ విజయానికి కారణం మూలకథకు చేసిన ఒక జోడింపు. ఒక సామాన్యమానవుడు స్వార్ధరహితంగా సమాజానికి మేలుచేయబోయి ప్రాణాపాయంలోపడటం ఆ జోడింపు. సగటు ప్రేక్షకుడికి ఆ హ్యూమన్ ఎలిమెంటు గొప్పగా కనెక్ట్ అయ్యింది.
ప్రాంతీయభాషాచిత్రపరిశ్రమలకు మరో మంచి ఆధారం దొరికింది. 1979 లో ‘డాన్’ సినిమా తెలుగు లో ‘యుగంధర్’ పేరు తో రి-మేక్ అయ్యింది. చైనాటవున్ రిమేక్ ‘భలే తమ్ముడు’ లో నటించిన ఎన్.టి. ఆర్ పది సంవత్సరాల తర్వాత మఌ ‘డాన్’ రిమేక్ లోనూ నటించాడు.
1980 లొ తమిళంలో ‘ బిల్లా’ పేరుతో రజనీకాంత్ హీరో గా వచ్చి అతనికెరీర్ కు కొత్తఊపు ఇచ్చింది.
***********
ఈ సినిమా పట్ల నిర్మాతల ఆకర్షణ ఆ తర్వాతా తగ్గలేదు.
‘ డాన్’ (2006) పేరుతోనే షారుఖ్ ఖాన్ హీరోగా హిందీ లో వచ్చింది. దానికి కొనసాగింపుగా తమిళ్ లో మరొకసారి ‘బిల్లా’ (2007)పేరుతోనే ‘అజిత్’ హీరో గా వచ్చింది. 2009 లో తెలుగు లో ప్రభాస్ హీరోగా ‘ బిల్లా’ పేరు తో వచ్చింది. డాన్ కు సీక్వెల్ గా షారుఖ్ ఖాన్ తో డాన్ 2 (2011) వచ్చింది.
ఈ సినిమాలలో చాలావరకూ కమర్షియల్ గా పరవాలేదనిపించాయి.
సినిమాల అసాధారణవిజయాలను ఒక ప్రసిద్ధదర్శకుడు ‘ఆక్సిడెంట్’లతో పోల్చాడు. ‘అన్నీ’ కుదరటం ఆ ఆక్సిడెంట్ లకు కారణం కావచ్చు. ‘ డాన్’ 1978 అలాంటి ఒక ఆక్సిడెంట్.
‘డాన్’ సినిమాలో బాగా పాపులర్ ఐన డైలాగ్ “ డాన్ కో పకడ్ నా ముష్కిల్ నహీ! న మున్ కిన్ హై!”’ (డాన్ ని పట్టుకోవటం కష్టమే కాదు. అసాధ్యంకూడా!).
అలాచెప్పాలంటే “ ఔర్ ఏక్ ‘డాన్’ కో బనానా ముష్కిల్ నహీ! న మున్కిన్ హై!
-ముళ్ళపూడి సుబ్బారావు

మహమ్మద్ రఫీ-3

 మహమ్మద్ రఫీ-3

నేను కంప్యూటర్ ఉపయోగించేక్రమంలో ‘ఎమ్.ఎస్.యాక్సెస్’ నా ఉద్యోగ అవసరాలకు తగిన అప్లికేషన్ అని నిర్ధారించుకున్నాను. దానిని ప్రాక్టీస్ చేయటానికి నేను ఎంచుకున్న డేటాబేస్ ‘ మహమ్మద్ రఫీ పాడిన పాటలు. దఫ దఫాలుగా సేకరించిన వివరాలు టాబ్యులేట్ చేసి, సాధ్యమైనంతమేర వివరాలను సవరించి యాక్సెస్ టేబుల్ గా మార్చాను. అందులోని ఫీల్ద్స్ (కాలమ్స్) సినిమాలపేరు, సంవత్సరం, పాట పల్లవి, తోటి గాయనీ గాయకులు, సంగీత దర్శకుడు, గీతరచయిత, ఎవరిపైన చిత్రీకరింపబడినది, భాష, జానర్(తరహా) మొదలైనవి.. డేటాను ప్యూరిఫై చేయటం పెద్దపని అయ్యింది. వివరాల కరెక్ట్ నెస్ ఒక భాగమైతే, స్పెల్లింగ్ అనేది మరోభాగం. ఉదాహరణకు ఒకే సంగీత దర్శకునిపేరు అతనికి సంబంధించిన అన్నిచోట్లా ఒకేరకమైన స్పెల్లింగు తో ఉండటం (పేరు మధ్యనున్న గాప్స్ తో సహా) వంటివి. ఇది అన్ని ఫీల్డ్స్ కు వర్తిస్తుంది.
ఫైనల్ గా ఐదువేల మూడువందల అరవై ఎనిమిది ‘రోస్’, పది ‘ఫీల్డ్స్’ తో ఉన్న రఫీ పాటల డేటాబేస్ తయారయ్యింది. దీనిని ఆధారం చేసుకుని వివిధరకాలైన కాంబినేషన్లలో డేటాను అనలైజ్ చేయవచ్చు. రకరకాల ‘క్వెరీ’లు రాయటం, ‘ఫార్మ్’లు సృష్టించటం, ‘రిపోర్టు’ లు రాయటం ప్రాక్టీస్ చేసాను.
స్వామికార్యం( ఆఫీస్కు అవసరమైన నా స్కిల్ సెట్ పెరగటం), స్వకార్యం(ముప్ఫైఆరేళ్ళపాటు సాగిన రఫీ గానవాహినిని దగ్గరగా చూడగలగటం) రెండూ దీనివల్ల సిద్ధించాయి.
******
“ ప్రతీ ఒక్కరూ ఏదోఒకటి అమ్ముకుంటూనే జీవిస్తారు “ అనేది రాబర్ట్ లూయిస్ స్టీవెన్ సన్ ప్రసిద్ధమైన కోట్.అంటే అందరూ ఏదో ఒకవ్యాపారంలో మునిగిఉంటారు. అందరికీ తమదైన ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ కి లైఫ్ సైకిల్ ఉంటుంది. రఫీ గానాలాపన అతని ప్రాడక్ట్. దాని లైఫ్ సైకిల్ ను కింది చూడవచ్చు.
******
1980 వరకూ వచ్చిన మేల్ సింగర్స్ పాడిన హిందీపాటలలో 50% రఫీనే పాడారు. సైగల్,తలత్ మెహమూద్, హేమంత్ కుమార్, ముకేశ్, మన్నాడే, కిషోర్ కుమార్,మహేంద్రకపూర్ వంటివారు తోటిగాయకులుగాఉన్న కాలమది. ఒకరకంగా మోనోపలి. రఫీ రికార్డింగ్ కు అందుబాటు లేకుంటేనే తనబోటి మిగతావారికి పాడే అవకాశం లభిస్తుందని ముకేశ్ ఒక సారి ‘చమత్కరించా’డని అంటారు. తలత్ మహమూద్ రఫీ పట్ల తన అసహనాన్ని కొన్నిసార్లు వ్యక్తం చేసాడు. 69/70ల లో తెలుగులోపాటలు పాడటానికి వచ్చిన రFఇకి ఘంటసాల ఆతిధ్యమిచ్చాడు. ‘తనకుపాటకు వెయ్యి ఇవ్వటానికి ఆలోచిస్తారు, బైటవారిని పిలిచి ఐదు వేలు ఇస్తారు’ అని ఘంటసాల ఆంతరంగికులతో అన్నారని చదివాను. రఫీ పాటల సంఖ్య అతని సంపాదననూ తెలియజేస్తుంది. దానివల్లే అరవైలలోనే తన పిల్లలను లండన్ లో చదివించగలిగాడు, స్థిరపరచగలిగాడు. బెర్క్ షైర్ లో క్వీన్ ఎలిజబెత్ నివాసముండే విండ్సర్ కాజిల్ కు కొన్ని నిముషాల దూరంలో రఫీ కుటుంబం నివసించింది.
********
రఫీ బ్రతికిఉన్నపుడు అతని జీవిత చరిత్ర రాలేదు. మరణం కూడా రెలేటివ్ గా చిన్నవయసులో సంభవించింది. అతని జీవితం తెరిచినపుస్తకంకాదు. తర్వాతికాలంలో అతనిపై వచ్చిన పుస్తకాలలో అతని మానసిక స్థితిగతులను చర్చించినవిలేదు.ఉన్నంతలో అతని కోడలు ‘యాస్మిన్ ఖాలిద్ రఫీ’ రాసిన ‘ మొహమ్మద్ రఫీ-మై అబ్బా- ఎ మెమ్మొయిర్’ ద్వారా కొన్ని వివరాలు తెలుస్తాయి. కెరీర్ లో మెజారిటీ కాలం మొనాపలీ అనుభవించిన రఫీ కి ఒడిదుడుకులు, క్లిష్టసందర్భాలు లేవా? ఉన్నవనే కొందరు చెబుతారు. ప్రత్యేకంగా 70-75 ప్రాంతాలలో అతడు ఒత్తిడికి లోనయ్యాడంటారు. అది వృత్తిపరంగానే కాక, మతపరమైనదిగానూ చెబుతారు. హజ్ యాత్ర చేసిన తర్వాత తన వృత్తి మతధర్మానికి విరుద్ధమైనదేమోనని సంఘర్షణకు లోనయ్యాడు. అతను చేసిన చారిటీలను మతపెద్దలు నిరాకరించటం అతనిని బాధించింది. ఆసమయంలో ఎక్కువకాలం అతను లండన్ లో కుటుంబ సభ్యులతో గడిపాడు. అప్పటి వివరాలు ‘ మొహమ్మద్ రఫీ-మై అబ్బా- ఎ మెమ్మొయిర్’లో ప్రస్తావితమయ్యాయి. ఆవివరాలను పరిగణనలోకి తీసుకుంటే అతని వృత్తిపరమైన వెనుకబాటు అతన్ని పెద్దగాబాధించినట్టు కనపడదు.
-ముళ్ళపూడి సుబ్బారావు

మహమ్మద్ రఫీ - 1 (రఫీ పై పుస్తకం)

 మహమ్మద్ రఫీ - 1 (రఫీ పై పుస్తకం)

నలభై సంవత్సరాలక్రితం (ఆగస్ట్ 1, 1980) ఉదయం, భిన్నభావాలు కలగాపులగంగా ఉన్న స్థితితో ఉన్నాను. కాలేజ్ చదువుకోసం ఊరువదిలి ఏలూరు వెళ్ళబోతున్నాను. గాయకుడు మహమ్మద్ రఫీ అంతకుముందురోజు చనిపోయాడు.రేడియోలో రఫీ గురించిన విషయాలు చెప్పారు. అతను పాడిన పాటలు వినపడుతున్నాయి. తెలుగు హిందీ సినిమాపాటలు , గాయకుల పేర్లూ చిన్నప్పటినుండీ పరిచయమే. డెబ్భై నాలుగులో ఘంటసాల, డెబ్భై ఆరులో ముకేశ్ ల నిష్క్రమణం నాకు తెలుసు. ఇప్పుడు రఫీ. ఘంటసాల, ముకేష్ ల మరణం వార్తగా విన్నదేగాని మనసుకు కష్టం కలిగించింది కాదు. కాని అప్పుడు రఫీ మరణం నాకు విచారం కలిగించింది. నేనప్పుడు ఉన్నస్థితి ఆ విచారాన్ని మరింతపెంచింది.
గతనలభైయేళ్ళుగా ఆగస్ట్ 1వ తారీఖున ఆ మానసిక స్థితికి తిరిగి,తిరిగి లోనౌతూఉంటాను. మహమ్మద్ రఫీ గురించి వివరాలు నేను కొత్తగాచెప్పగలిగేవి లేవు. అతని పాటలద్వారా నేను పొందిన అనుభూతులున్నాయి. సంతోషంలో,ఆనందంలో, దుఃఖంలో,విచారంలో, నిస్పృహలో, ఒంటరితనంలో, ఓటమిలో రఫీ పాటలు నాకు తోడునిలిచాయి. తిలక్ ఒక కవితలో అన్నమాట “ నువ్వు లేవు. నీ పాట ఉంది” నాకు రఫీ విషయంలో వర్తిస్తుంది.
ఫ్లిప్ కార్ట్, అమజాన్ వంటివి రాకముందు పుస్తకాల సేకరణ చాలాకష్టంగాఉండేది. కోల్ బెల్ట్ వంటి రిమోట్ ప్రాంతాలలో ఉండేవారికి అది మరింత కష్టం. ఇంటర్నెట్ రాకముందు అభిరుచికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటం, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవటం, అభిప్రాయాలు పంచుకోవటం కష్టంతో మాత్రమే సాధ్యమయ్యేది.
రఫీ కి సంబంధించిన పుస్తకఅన్వేషణలో నాకు దొరికిన తొలి పుస్తకం అనూహ్యంగా హైదరాబాద్ నుండే వచ్చింది. పుస్తకం పేరు “ బయోగ్రఫీ విత్ కంప్లీట్ సాంగ్స్ (1944 టు 1990) -మహమ్మద్ రఫీ- ది గ్రేట్ ఇమ్మోర్టల్ సింగర్ “. పుస్తక రచయిత పేరు ‘సలీమ్ ఉల్ హక్’. ఈ పుస్తకంతో పాటు సినిమాలలో రాని రఫీ పాటల తో కూర్చిన ‘ సి.డి’ కలిసి ఉంది.
ఇంగ్లీష్ లో ఉన్న పుస్తకంలో కంటెంటు ఇలా ఉంది.
1. ఫోర్ వర్డ్ (ముందుమాట),
2. ఎ వర్డ్ ఫ్రమ్ సలీమ్ -ఉల్- హక్ -గార్డెనర్ ఆఫ్ హిందీ ఫిల్మ్ సాంగ్స్ ( హిందీ పాటల తోటమాలి సలీమ్ ఉల్ హక్ నుండి ఒక మాట),
3. బయోగ్రఫీ ఆఫ్ మహమద్ రఫీ ( రఫీ జీవిత వివరాలు 13 పేజీలలొ ),
4.రఫీ పాడిన 4473 పాటల వివరాలు ( సంవత్సరం,,సంగీతదర్శకుడు, గీత రచయిత,పాట పల్లవి, ఎవరిపై చిత్రీకరింపబడినది)
ఒంటి చేతితో ఈ డేటా తయారుచేయటం, వనరులు పరిమితంగాఉన్న కాలంలో సాధారణం విషయం కాదు. చేసేపనిపట్ల గొప్పపూనిక, ప్రేమ ఉంటేతప్ప సాధ్యంకాదు. ఇంటర్నెట్, సోషల్ నెట్ వర్కింగ్, ఐ.టి టూల్స్ వ్యాప్తిలోకి వచ్చాక ఇలాంటి పని తేలికకావచ్చుకాని రెండు దశాబ్దాలక్రితం ఇలాంటిపని మాత్రం ఒకమనిషి జీవితకాలశ్రమ.
ఈ పాటలవివరాలు డేటా బేస్ గా కంప్యూటర్లో దాచి, మరికొన్ని వివరాలు సేకరించాకకూడా ఈ పుస్తకాన్ని నాదగ్గర పదిలంచేయటానికి ముఖ్యకారణం - ఇందులోని ‘ ఎ వర్డ్ ఫ్రమ్ సలీమ్ -ఉల్- హక్ -గార్డెనర్ ఆఫ్ హిందీ ఫిల్మ్ సాంగ్స్’ . ఆ మాటల్లో నేను ఎంపతైజ్ చేసుకోగలభావముంది.
రచయిత రాసిన ఇంగ్లీష్ చాలా సామాన్యంగా ఉంది. అతనికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యత అంతగా లేదు. ఐనా అది అతని మనోగతాన్ని చెబుతుంది.
అతని ‘ఒక మాట’ కు నా తెలుగు అనువాదం.
“భగవంతుడు తన నిర్ణయాన్ని అమలుచేసేటపుడు మనిషి, మనిషి ని వేరుగా చూడడు. కొందరికి తొలినాళ్ళలో సంతోషమయ దినాలు మలినాళ్ళలో కష్టభరిత కాలం, కొందరికి కష్టమైన తొలికాలం సుఖంతో కూడిన చివరికాలం.. అలా కష్టసుఖాలు, సుఖదుఃఖాలు కలగలిపి ఇస్తుంటాడు. ఐతే కొంతమందికి మాత్రం అంతా కష్టకాలాన్నే ఇస్తాడు.
వీటిలో నేను ఏ గ్రూపు కు చెందుతానో నాకు తెలియదు. నా జీవితప్రారంభదినాలనుండే కష్టాలు చుట్టుముట్టాయి.1968లో తల్లితండ్రులను పోగొట్టుకున్నాక జీవిత పరుగుపందెంలో పడ్డాను. ఇప్పటివరకూ ఏ ఒక్కరోజూ మనస్పూర్తిగా నవ్వలేకపోయాను. కానీ భగవంతుడు నన్నొకపనికి పురికొల్పి దీవించాడు. గతకాలపు ‘మాస్టర్స్’ పాడిన హిందీ సినిమాపాటల సేకరణే ఆపని.
నా చీకటి రోజుల్ని తలచుకోవటానికి తీరికలేనంతగా సంగీతప్రపంచంలో మునిగిపోయాను. నేను సేకరించి ‘సి. డి’ గా ఇచ్చిన పాటల్లో సినిమాలోకాన్సిల్ చేయబడ్డవీ వున్నాయి, వాటిల్లో కొన్ని హృదయాల్ని తేలికపరచేటివి, శ్రావ్యభరితమైనవి ఉన్నాయి.కొన్ని ఏసినిమాలకు చెందినవో తెలియదు కాని వ్యధాభరిత హృదయాలను స్పృశించగలిగేట్టు ఉన్నాయి.
మహమ్మద్ రఫీ పాడిన ఈ ఇరవై పాటలు పిల్లల్ని పెద్దల్ని ఏదోవిధంగా ప్రభావితం చేస్తాయి.
ఈ సిడి తయారు చేసాక, నాబాధను, ఆందోళనను మరిచి పెద్ద బరువు దించుకున్నట్టు అనిపిస్తుంది. మీకు అలాంటి అనుభూతి కలుగుతుందని నమ్ముతున్నాను. వసంతం పచ్చదనాన్ని తెస్తుంది. శరత్తు,హేమంతం పుష్పింపజేస్తాయి, శిశిరం ఆకుల్ని రాలుస్తుంది. ఈ ప్రకృతి చక్రం మానవజీవితానికి వర్తిస్తుంది. కాని సంగీతం గడ్డుకాలంలోను ఉపశమనాన్నిస్తుంది, జీవించాలనే కోర్కె ను పెంచుతుంది. “

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

  కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3) కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్న...