Tuesday, December 15, 2020

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

 కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్నగానే ఉంటాయి. కొన్ని సినిమాల డైలాగ్ లను మాత్రమే చూసినపుడు యాభై పేజీల లోపే ఉంటాయి.
ప్రపంచసాహిత్యం లోని క్లాసిక్స్ చాలానే సినిమాలు గా వచ్చాయి. వార్ అండ్ పీస్,అన్నా కరేనినా, క్రైమ్ అండ్ పనిష్మెంట్, గు డ్ ఎర్త్ , టేల్ ఆఫ్ టు సిటీస్, ఫర్ హూమ్ డి బెల్స్ టోల్, గాన్ విత్ డి విండ్ వంటి పరిమాణ రీత్యా పెద్దవయిన నవలనుండి ది స్ట్రేంజర్ (ఆల్బర్ట్ కామూ ) వంటి అరవై పేజీల చిన్న నవలలూ ఇంచుమించు సమానమైన నిడివితో ఉన్న సినిమాలు గా వచ్చాయి.
‘ది స్ట్రేంజర్’ సినిమా చూస్తుంటే నవలను ప్రత్యక్షంగా చూస్తున్నట్టే ఉంటుంది. సినిమా చూసి నవల చదివితే ‘ సినిమా నవల’ గా అనిపిస్తుంది. అయితే ఇలా మూలాన్ని యధాతధంగా సినిమాగా చెప్పటం చాలా తక్కువసార్లు సాధ్యపడుతుంది. నవల సినిమా గా వచ్చినపుడు మూలపు వివరాలే కాక మూలపు సారాంశం కూడా కొన్ని సార్లు మారిపోతుంది. కొన్ని సార్లు కావాలని, కొన్ని సార్లు అనుకోకుండా కూడా ఈ మార్పు జరగవచ్చు.
కన్యాశుల్కం నాటకాన్ని సినిమా ఫ్రేమ్ లో కుదించటం లో ఉన్న అననుకూలతవల్ల చాలా మంది ఆ పని సంకల్పించి విరమించారు. ఆ తర్వాతైనా నిర్మాతలు సాహసించటానికి కారణం నాటకానికి ఉన్న గుర్తింపు సినిమాకు కమర్షియల్ గా ఉపయోగపడుతుందనే కానీ గురజాడ ఉద్దేశించిన నాటక ప్రయోజనాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళటం కాదు. అయితే సినిమా లో ప్రజారంజకత్వం కోసం అవసరమైన కళాత్మకత లోపించకుండా వారు చూసుకుంటారు . దానికోసం రచనలోని ముఖ్యాంశానికి భిన్నంగా కూడా పోతారు. ఆర్ కె నారాయణ్ తన నవల ‘గైడ్’ ఆధారంగా అదే పేరుతో వచ్చిన సినిమాను చూసి తన కథ కాదన్నాడు.
*********
కన్యాశుల్కం నాటకాన్ని ‘భీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం ‘ గా శ్రీ శ్రీ అభివర్ణించాడు. నేను మొదటసారి సినిమా చూసినపుడు నాకది ‘హాస్యరస ప్రధానమైన ప్రమోదాంత సినిమా ‘ గాకనిపించింది.
సినిమా మీద పెద్ద విమర్శ దాని ముగింపు పైన. గీరీశం గురించి నిజాలు తెలుసుకున్న సౌజన్యారావు అతన్ని వెళ్ళ గొట్టటం తో నాటకం ముగుస్తుంది. అయితే సినిమా గిరీశం – బుచ్చమ్మ వివాహం తోనూ రామప్ప పంతులు మినహా మిగతావారంతా పరివర్తన పొందటంతో ముగుస్తుంది. ఇది పూర్తిగా నాటక ఉద్దేశానికి విరుద్ధమన్నది ఆ విమర్శ.
గురజాడ నాటకానని ఏమి ఉద్దేశించి రాశాడన్న దానిమీద విమర్శకుల భిన్నాభిప్రాయాలున్నాయి. రచయిత ఉద్దేశాలు నాటకం లో ప్రతిబింబించాయా అన్నది కూడా అందులో ఒక ప్రశ్న. ఇలాంటి నేపధ్యం లో సినిమా నాటక లక్ష్యానికి దోహదం చేసిందా లేదా అన్నది సినిమా విజయానికో పరాజయానికో కారణం కాకపోవచ్చు.
************
ఈ నాటకాన్ని సినిమా గా మార్చటం లో గొప్ప శ్రమఉంది.చిత్ర రచన లో చాలాచోట్ల సఫలత ఉంది. అప్రధాన (?) పాత్రలనుకున్నవాటిని పరిహరించటం వల్ల నాటకంలో ఉన్న కన్ఫ్యూజన్ సినిమాలో తగ్గింది. మొదటిలోనే పాత్రల పరిచయం, వాటిమధ్య సంబంధాలు చెప్పటం లో నేర్పు కనపడుతుంది.
నాటకంచదువుతున్నపుడు ఒక గాప్ లా అనిపించే విషయం ఒకటుంది. లుబ్ద అవధానులు తో తన కూతురు పెళ్ళికి తాంబో లాలు ఇచ్చేశానని అగ్ని హోత్రావధానులు అంటాడు. ఎవరి ద్వారా ఆపని జరిగిందనేది తెలియదు. లుబ్ద అవధానులు పెళ్ళి రామప్ప పంతులు ద్వారా జరుగుతుందని తెలుస్తుంది. అలా అయితే తాంబూలాలు రామప్ప పంతులద్వారానే జరిగుండాలి. కానీ నాటకం లో అగ్నిహోత్రావధానులు – రామయప్పం పంతులు చెరువు గట్టున కలుసుకున్నపుడు వారు ఒకరికొకరు అపరిచితులలానే కనిపిస్తారు. మరి పెళ్ళి కి మధ్య వర్తిత్వం జరిపిందెవరు?
సినిమా మొదటిలోనే పెళ్ళి మాటలు మాట్లాడి రామప్ప పంతులు, అగ్నిహోత్రావధానులు కు తాంబూలాలు ఇస్తాడు. చివరిలో చెరువు గట్టున కలిసినపుడు వారు పరిచయస్తులు లానే మాట్లాడుకుంటారు. ఈ చేర్పు చిత్ర రచనలో తీసుకున్న శ్రద్ధ ను తెలియజేస్తుంది.
********
-ముళ్ళపూడి సుబ్బారావు

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 2)

 కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 2)

డెబ్భైలలో నవలలను బేస్ చేసుకున్న సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఆ రోజులలో ఒక జోక్ ఉండేది.టౌన్లలో ఆవులు వాల్ పోస్టర్లను నోటికి అందుకుని తినేవి. పోస్టర్ తింటున్న ఒక ఆవు మరో ఆవుతో అంటుంది “ సినిమా నవలంత బాగాలేదు”.కొద్ది మినహాయింపులతో సాధారణం గా నవలా చిత్రాలను చూసిన ప్రేక్షకులు, విమర్శకులు పెదవి విరుస్తారు.
కన్యాశుల్కం నాటకం వచ్చిన కొద్ది కాలానికే ఆ దురాచారం తగ్గి దాని బదులుగా వరకట్నం వచ్చింది. కన్యాశుల్కం నాటకం తర్వాత 1920-22 ప్రాంతాలలో కాళ్ళకూరి నారాయణరావు ‘వర విక్రయం ‘ నాటకం వరకట్న దూరాచారాన్ని ఖండిస్తూ రాశారు. ఆ నాటకం సినిమా గా 1939 లోనే తీయబడింది.
కన్యాశుల్క దురాచారం రూపుమాసినా ‘కన్యాశుల్కం ‘ నాటకం ప్రాభవం తగ్గలేదు. పెద్ద ఎత్తున నాటకం గా ప్రదర్శింపబడుతూనే ఉంది. నాటకం గురించి విమర్శలు, చర్చలు సాగుతూనే ఉన్నాయి. అంటే కన్యాశుల్కమనే అంశమేకాక ప్రాసంగికత కొనసాగే అంశాలెన్నో అందులో ఉండిఉండాలి.
******
కన్యాశుల్కం సినిమాగా రాకముందు “ ‘ సెల్యులాయిడ్ లో ‘కన్యాశుల్కం’ “ పేరుతో శ్రీ శ్రీ ఒక వ్యాసం రాశాడు. ఆయన మాటలు కొన్ని .. కన్యాశుల్కాన్ని ఫిల్మ్ తీయటం వల్ల ‘లాభం’ లేదనేవాళ్ళతో నాకు పేచీ లేదు. .. నేను ఒకటే ప్రశ్న వేస్తాను. కన్యాశుల్కం మీద ఎంత డబ్బు ‘నష్టం ‘ పొందటానికి సిద్ధమౌతున్నారు? అని. .. మీరు ఏదైతే నష్టం అనుకుంటున్నారో అదే కొన్నాళ్ళకు మీకు మహాస్పష్టం గా కనిపించే లాభా లిస్తుంది.
మరి కొన్ని మాటలు ఆయనివే.. కన్యాశుల్కం లో మాటలే కానీ బొమ్మలు లేవట. అంచేత అది ఫిల్మ్ కి అనర్హమట. మాటల్ని బొమ్మల్ని గా మార్చే శక్తి మీకు లేదనండి.అదే న్యాయమైన మాట.
******
శరత్ బెంగాలీ నవల ‘దేవదాసు’ తెలుగు అనువాదం దేవదాసును తెలుగువాణ్ణి చే సేసింది. ఆ నవలను డి. ఎల్ . నారాయణ సినిమాగా నిర్మించి గొప్ప విజయం సాధించాడు. ఆ తర్వాత ప్రయత్నం గా తెలుగు నాటకం ‘ కన్యాశుల్కం’ ను ఎన్నుకున్నాడు. . అప్పటికే చాలా మంది ప్రయత్నించి విరమించిన యత్నమది. నిజానికి నాటకం గా కూడా ప్రసార యోగ్యత (నిడివి, సన్నివేశాలు) లేదని కన్యాశుల్కం నాటకం పై విమర్శ ఉన్నది.
గొప్ప నాటకం, ‘కధాశివ బ్రహ్మం ‘ గా పేరుగాంచిన వెంపటి సదాశివ బ్రహ్మం సినిమా రచన, పి. పుల్లయ్య దర్శకత్వం . గురజాడ , బసవరాజు అప్పారావు, శ్రీ శ్రీ , మల్లాది రామకృష్ణ శాస్త్రి వంటి వారి గేయాలు గీతాలు కు ఘంటసాల అందించిన సంగీతం, గొప్ప నటవర్గం.... ఇన్ని ఒనగూడినా కన్యాశుల్క సినిమా విషయం లో శ్రీ శ్రీ జోస్యం నిజమయ్యింది.
సినిమా వాణిజ్య పరంగా ని రాశ పరచింది. సినిమా పైన రివ్యూలు, విమర్శలు, విశ్లేషణలు పెద్దగా జరగలేదు. ఇది 1955 సంగతి.
శ్రీ శ్రీ అన్న రెండో మాట ‘కొన్నాళ్ళ తర్వాత లాభా లిస్తుంది’ కూడా నిజమయ్యింది . అది 1985 లో. మలి రిలీజు లో కన్యాశుల్కం సినిమా అసాధారణంగా 100 రోజులపాటు ప్రదర్శితమై లాభాలనిచ్చింది.


కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 1)

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 1)

గొప్ప నాటకంగా గురజాడ అప్పారావు రాసిన ’ కన్యాశుల్కం ‘ గురించి విని ఉన్నాను. ఎమెస్కో వారి కన్యాశుల్కం పుస్తకం బాపు ముఖచిత్రం తో లైబ్రరీ లో ఉండేది. దఫాదఫాలుగా కష్టపడి చదివాను.అందులో భాష నాకు పూర్తి పరిచయం ఉన్నది కాదు. కొన్ని చమత్కార సంభాషణల మినహా పుస్తకం అప్పటికి అర్ధం కానట్టే.
‘కన్యాశుల్కం’ సినిమా రిపీట్ రన్ గా ఎనభైలలో లో కొత్త ప్రింటుతో వచ్చింది. ఎన్ టి ఆర్ , సావిత్రి మినహా మిగతా నటీనటులు నాకు పరిచేయమున్నవారు కారు. పుస్తకాలు బాగాచదివే నా కజిన్ ‘ప్రసాద్’ (అప్పుడు సి ఏ చదువుతున్నాడు) ఆ సినిమాకు బయలుదేరతీసాడు. సినిమాలో పాత్రలపేర్లు అప్పటికే తెలిసుండటంతో సినిమా ప్రారంభమైన కొద్ది సేపట్లోనే దానిలో లీనమైపోయాను . మా అన్న మరింత తాదాత్మ్యం తో చూస్తున్నాడు .
సినిమా పూర్తయ్యింది. నాకది హాస్యభరితమైన సినిమా కనిపించింది, గొప్పగా ఆనంద పరచింది. లుబ్దావధాన్లు, రామప్ప ం తులు , అగ్నిహోత్రా వధానులు , కరటకశాస్త్రి పాత్రలను ధరించిన నటుల నటన నాకు కొత్త అనుభవానిచ్చింది. అది ఎంతో సహజంగా ఉంది. ముఖ్యంగా గోవిందరాజుల సుబ్బారావు (లుబ్దావధాన్లు ) నటన నాకు మరింత నచ్చింది. సినిమా లో కామెడీ గురించి నేను పదేపదే చెబుతుంటే ఒకరోజు మా అన్న ‘ సంవేదన ‘’ అనే పుస్తకం ఇచ్చాడు. అందులో ఒక వ్యాసం పేరు చెప్పి నాను చదవమన్నాడు. ఆ వ్యాసం పేరు ‘ కన్యాశుల్కం(గురజాడ ?) పాత్రల విపరీత ధోరణులు’ . రాసిన వారు రాచమల్లు రామచంద్రారెడ్డి (రా రా ). సాహితీ విమర్శ , విశ్లేషణ అంటే పరిచయం లేని నాకు ఆ వ్యాసం కొత్త లోకాన్ని చూపింది.
కన్యాశుల్కం నాటకాన్ని ఆ వ్యాసం ద్వారా కలిగిన ఎరుక తో పలుమార్లు చదివాను. గురజాడ మిగతా రచనలు , ముఖ్యం గా ఆయన రాసిన కథలు చదివాను. గురజాడ పై శ్రీ శ్రీ వ్యాసాలు ,ఆ తర్వాత గురజాడ , కన్యాశుల్కం పై వచ్చిన విమర్శనాగ్రంధాలు, వ్యాసాలు దొరికిననల్లా చదివాను.
******
కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ రెండు పర్యాయాలు రాశారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్నది రెండవ సారి రాసినది.
ఇది నాటక రంగం పై అప్పటినుండి ప్రదర్శింపబడుతూనే ఉంది. సినిమా లోలుబ్దావధాన్లు గా కనిపించిన గోవింద రాజుల సుబ్బారావు , నాటక రంగం పై గిరీశం పాత్రను చాలా యేళ్ళపాటు పోషిం చాడు. జే వి సోమయాజులు, జె వి రమణ మూర్తి బృందం చాలా కాలం నాటకాన్ని ప్రదర్శించారు.
1955 లో సినిమాగా వచ్చింది.
సెట్టి ఈశ్వరరావు నాటకాన్ని నవల గా మార్చి రాశారు
చిత్రకారుడు ‘బుజ్జాయి’ ( కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుమారుడు) కన్యాశుల్కా న్ని బొమ్మల పుస్తకం గా తీర్చిదిద్దారు. ( పది సంవత్సరాల క్రితం నేను బుజ్జాయి గారిని ఆ పుస్తకం గురించి అడినపుడు –తన దగ్గర ఉన్న ఒకే కాపీ ని విశాలాంధ్ర వారు పుస్తకం గా వేస్తామని తీసుకున్నారని చెప్పారు.)
చిత్ర కారుడు బాపు కన్యాశుల్కం పాత్రలతో అనేక వ్యంగ్య చిత్రాలు గీశాడు.
రేడియో నాటకం గా ప్రసారం చేయబడింది
దూర దర్శన్ లో టి వి సీరియల్ గా వచ్చింది.

















Monday, October 5, 2020

తండ్రులు- కొడుకులు

తండ్రులు- కొడుకులు 

కథానాయకుడు ఒక పోలీస్ ఆఫీసర్. డ్యూటీ కి ప్రాణమిచ్చేవ్యక్తి.  భార్యను, కొడుకును అమితంగా ప్రేమిస్తాడు. చిన్నవయసులోనే కొడుకులో నేరప్రవృత్తి చూసివిలవిలలాడాడు. తప్పని పరిస్థితుల్లో అతణ్ణి బాల నేరస్తులపాటశాలలో చేర్చాడు. కొడుకు పెద్దవాడై తిరిగి వచ్చేసరికి తండ్రి  ఎస్. పి. గా  పదోన్నతి సాధించాడు పెద్ద హోదాలో ఉన్నాడు.


తిరిగివచ్చిన కొడుకు తండ్రిపట్ల కోపంతోనే ఉన్నాడు. తల్లికోరికమీద ఇంటిలో ఉండటానికి ఒప్పుకున్నాడు.తల్లి తండ్రులు అతని  వివాహ ప్రయత్నాలు చేసారు. అతని గతం  అందుకు అవరోధం అయ్యింది. కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెఌచేసుకుని ఇంటికి తెచ్చాడు.

నగరంలో పెద్ద దొంగతనం జరిగింది. కేసు దర్యాప్తు జరుగుతుంది. డ్యూటిలో భాగంగా ఎస్.పి. వేరే ప్రాంతానికి వెళ్ళాడు. 

ఎస్.పి. ఇంటికి వడ్డివ్యాపారి వచ్చాడు. తన బాకీ నిమిత్తం ఎస్.పి. ఇచ్చిన చెక్కు చెల్లపేదని ఎస్.పి.ని అవమానిస్తూ మాట్లాడాడు.ఇంటి దగ్గరే ఉన్న కొడుకు అతనితో ఘర్షణ పడ్డాడు. తండ్రిని అవమానించటం తో అతను ఆవేశపడ్డాడు. తన స్నేహితులతో మాట్లాడి డబ్బు తెప్పించి వడ్డీ వ్యాపారికి చెల్లు వేశాడు.

కొద్దిరోజుల తర్వాత ఇంటిలో కొడుకు పుట్టిన రోజు జరుగుతుంది. ఎస్.పి. కుటుంబసభ్యులతో కూడి అనేకమందితో వేడుక చేస్తున్నాడు. ఒక పోలీస్ వచ్చి ఎస్.పి. ఏదో వార్తతెచ్చాడు. ఎస్.పి. లోపలికి వెఌ పోలీసు దుస్తులలో బయటకు వచ్చి అందరి మధ్య కొడుకును దొంగతనం నేరం మీద అరెస్ట్ చేయించాడు.

వడ్డీ వ్యాపారి వ్యవహారం ఎస్.పి. నడిపిన నాటకం. కొడుకును ఆవేశపరచి అతనితో దొంగ సొత్తును బైటకు లాగాడు.

దీనితర్వాతా  కథ నడుస్తుంది. కొడుకు మరిన్ని నేరాలు చేస్తున్నాడు. కుటుంబానికి దూరమయ్యాడు. తల్లి అంత్యక్రియలకుకూడా రానంత ద్వేషం తండ్రిపట్ల పెంచుకున్నాడు. చివరకు దేశద్రోహం చేస్తూ తండ్రి చేతుల్లో మరణించాడు. డ్యూటి గొప్పగా నిర్వర్తించించినందుకు ఎస్.పి, కి బంగారు పతకం లభించింది. ఈ  తమిళ సినిమా పేరు తంగ పతకం (1974-బంగారు పతకం) .శివాజి గణేశన్ పాత్ర పేరు ఎస్.పి. ఛౌధరి.

***********

ఇరండిల్   ఒంద్రు  ( రెంటిలో ఒకటి)  పేరుతో జె. మహేంద్రన్ (నటుడు ,రచయిత, దర్శకుడు) ఒక సాంఘిక నాటకం రాసాడు. నాటకం లో ప్రధాన పాత్ర ఎస్. పి. కి బెంగాలీ పేరు 'ఛౌధరి' సూట్ అవుతుందని ఆ పేరు పెట్టాడట.    ఆనాటకాన్ని శివాజి గణేశన్ తంగపతకం పేరుతో స్వయంగా నిర్మించాడు.
సినిమా మొత్తం గొప్పడ్రామాతో నడుస్తుంది. ప్రధానపాత్రలు నాలుగు -తల్లీ, తండ్రీ, కొడుకూ కోడలు.  ప్రధాన లోకేషన్లు , ఎస్. పి. ఇల్లు. పోలీస్ స్టేషన్, కొడుకు ఇల్లు. ప్రతీ సన్నివేశం లోనూ డ్రమెటిక్ సంభాషణలుంటాయి. సమాంతరంగా సాగే కథకు సంబంధం లేని కామెడి ఎపిసోడ్ ను, కొద్దిసేపటి ఔట్ డోర్ భాగాన్ని తీసేస్తే  సినిమా  ఇంచుమించు నాటకం లానే సాగుతుంది. కాని  పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తాయి. రోమాంఛితుల్ని చేస్తాయి.
***********
ఈ సినిమాను అల్లు రామలింగయ్య 'గీతా ఆర్ట్స్ ' బానర్ పై  'బంగారు పతకం' (1975?) పేరుతో తెలుగు లో డబ్ చేసారు. శివాజీ గణేశన్ కు నటుడు  జగ్గయ్య డబ్బింగ్ చెప్పారు. తెలుగులో కూడాసినిమా ప్రేక్షకులకు ప్రసంశలు పొందింది.

**********

రోజా మూవీస్ సంస్థ 'వేటగాడు' (1979) సినిమా ద్వారా అనూహ్య విజయాన్నందుకుంది. వారి మలిప్రయత్నం 'కొండవీటి సింహం' (1981). ఈ సినిమా 'తంగపతకం ' ఆధారంగానే వచ్చింది. తమిళసినిమాలో ఉన్న డ్రామా తో ముడిపడి ఉన్న పాత్రలతో పాటు మరికొన్ని పాత్రలు చేరాయి.  తమిళ మాతృకలోని కామెడి ట్రాక్ స్థానాన్ని  గ్లామరస్   సాంగ్స్, పూర్తిస్థాయి విలనీ భర్తీచేసాయి. సినిమా ఆసంవత్సరపు భారీ హిట్ గా నిలిచింది. ఐతే మాతృక లోని ఎమోషనల్ అంశపు సాంద్రత తెలుగులో తగ్గిందనిపిస్తుంది. ఎన్.టి. ఆర్ పాత్ర పేరు ఎస్.పి. రంజిత్ కుమార్

***********

అమితాబ్ సూపర్ స్టార్ గా మారిన తరుణంలోనే దిలీప్ కుమార్ తన నటప్రస్థానానికి కొమ్త విరామమిచ్చాడు. అతని పునరాగమసమయంలో నిర్మాతలు ముషీర్- రియాజ్ లు గొప్ప కాంబినేషన్ కోసం ప్రయత్నం చేసారు. ఆ  కాంబినేషన్ "   దిలీప్ కుమార్,అమితాబ్ బచన్, షోలే సినిమా దర్శకుడు రమేష్ సిప్పీ, కథారచయితలు సలీమ్ - జావేద్ ". వారితో పాటు ఆర్ డి బర్మన్, ఆనంద్ బక్షిలు ఉన్నారు.  దీనికై వారు 'తంగపతకం' ను మూలకథగా ఎంచుకున్నారు. 'శక్తి ' (1982) పేరుతో ఆ సినిమా వచ్చింది.

మూలకథకు ఇంప్రూవైజేషన్ అనదగ్గ మార్పులు జరిగాయి. తండ్రి పట్ల కొడుకు ద్వేషానికి కారణాలు చెప్పబడ్డాయి.  కొడుకునేరాన్ని పట్టుకోవటానికి 'తంగపతకం' లో   ఎస్.పి. చౌధరి  ఉపయోగించిన (ఒకవిధంగా హిట్టింగ్ బి లో బెల్ట్) కుటుంబ/తండ్రి గౌరవం అంశం హిందీ లో కనిపించదు. కొడుకు పాత్ర ప్రవర్తనకు హేతువు కనిపిస్తుంది.  తంగపతకం సినిమా లో  సంభాషణ ఆధారంగా ఎక్కువ కథ  నడుస్తుంది. 'శక్తి ' సినిమా సంభాషణల నిడివి తగ్గింది. పాత్రధారులకు నటనకు గొప్ప అవకాశమిచ్చింది. సినిమా మొత్తం ఒక ప్రత్యేకమైన మూడ్ లో నడుస్తుంది. ప్రేక్షకులకు తాము ఏ పాత్రలో ఐడెంటిఫై కావాలో తేల్చుకోలేనట్టు ఉంటుంది. 


సినిమాలో కొన్ని సంభాషణలు:

డిసిపి అశ్వనీకుమార్ (తండ్రి):
సత్యం వైపే ఉండాలని ఒట్టు పెట్టుకున్నవారికి ప్రపంచం కఠినమైన పరీక్షలు పెడుతుంది.
*****
విజయ్ (కొడుకు):
మా తండ్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నేను కొడుకును . మరో భార్యకు చట్టం కొడుకు.
******
క్లైమాక్స్ లో తండ్రీ కొడుకుల సంభాషణ:

కొడుకు:  "మీ పట్ల ప్రేమను చెరిపేయాలని ఎంతో ప్రయత్నించాను. మిమ్మల్ని ద్వేషించాలని ఎంతో కోరుకున్నాను.కాని మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఎందుకిలా?"

తండ్రి: "ఎందుకంటే ! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను."

కొడుకు: "మరి నాకెందుకు చెప్పలేదు నాన్నా!"

పై సినిమాలో ప్రత్యేకంగా 'శక్తి ' సినిమాలో  కనిపించె దుఃఖానికి కారణమేది అంటే నాకనిపించేది - భావాలను వ్యక్తీకరించ(లే)కపోవటం.
                                                                                                                  - ముళ్ళపూడి సుబ్బారావు














 
   

Monday, September 21, 2020

నాణానికి ఒకవైపే రెండు దృశ్యాలు- (న్యూటన్ : ఉండ)

నాణానికి ఒకవైపే రెండు దృశ్యాలు-  (న్యూటన్ : ఉండ)


'న్యూటన్' హిందీ  సినిమా 2017 లో వచ్చింది.

నూతన్ తన పేరును న్యూటన్ గా మార్చుకున్నాడు. అతను న్యూటన్ లా సైంటిస్ట్ కాడు. చిన్న ప్రభుత్వోద్యోగి. మిగతావారినుండి అతన్ని వేరుగా చూపేది అతని నిబద్ధత. వృత్తినిర్వహణలోనే కాక వ్యక్తిగత జీవితంలో కూడా. తల్లితండ్రులు బలవంతం చేసినా  మైనర్ అమ్మాయిని పెఌ చేసుకోలేదు. అతను నిజమనినమ్మిన వైపు తిన్నగా చూస్తాడుకాని పక్కకు చూడడు. 
తన నిజాయితీ పట్ల అతనికి ఒకింత అహంకారంకూడా ఉందనిపిస్తాడు.  ఒక సీనియర్ కి అతని కి మధ్య సంభాషణ:

" నీ ప్రాబ్లెమ్ ఏమిటో నీకు తెలుసా?
 " నా నిజాయితీ" 
" కాదు నీ నిజాయితీ వల్ల నువ్వు చూపే తలబిరుసు". 
సీనియర్ మరోమాట అన్నాడు
" నీ పని నువ్వు చేసినందుకు మిగతావారు నీకు థాంక్స్ చెప్పాలనికోరుకుంటున్నావా?"


ఎన్నికల సమయంలో అతనికి ఎలక్షన్ డ్యూటీ పడింది. మిగతావారు లౌక్యంతో వదిలించుకున్న కష్టమయమైన డ్యూటి అతను తలకెత్తుకున్నాడు. రోడ్ ద్వారా చేరలేనంత మారుమూల ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా ఎన్నికలు నిర్వహించటానికివెళ్ళాడు. 

ఎన్నిక నిర్వహించటంలో అతను సమస్య అనుకున్నవారు వేరు ,అతనికి సమస్య ఐన వారు వేరు.

అతనికి సహకరించవలసిని మిలటరీ అధికారి అతనికి శల్యునిలా మారాడు. "

ఆ మిలటరీ    అధికారి తను మోసే  రైఫిల్ బరువు అంటున్నాడు " పట్టుకోండి. చాలా బరువు ఉంటుంది. అది దేశం బరువు. మా భుజాలమీద ఉంది"


కలిసిపనిచేయవలసిన ఇద్దరూ ప్రత్యర్ధులు అయ్యారు. వారి నమ్మకాలు, అనుభవాలు, అహాలు దానికి కారణం. దేశపు మధ్యభాగపు అటవీ ప్రాంతపు ఎన్నిక వారిద్దరి బాహాబాహీతో ముగిసింది. 

ఎన్నికలతరువాత ఆప్రాంతంలో హెవీ మిషనరీ తో తవ్వకాలు మొదలయ్యాయి. మిలటరీ అధికారి నగరంలో ,  కుటుంబంతో సూపర్ బజార్ లో సరుకులు కొనుక్కుంటున్నాడు. న్యూటన్  పాతబడ్డ అఫీసులో కంప్యూటర్ పై పనిచేసుకుంటున్నాడు. అతని మెడకు కాలర్ పెట్టుకున్నాడు. ఆ కాలర్ అత్ని మెడను పక్కకు తిప్పనివ్వదు. అతను తిన్నగానే చూడగలడు.

మలయాళ సినిమా 'ఉండ' ( తూటా/ బుల్లెట్)  2019 లో వచ్చింది.

ఈ సినిమా ఎన్నికల నేపధ్యంలో ఇంచుమించు 'న్యూటన్'  సినిమా లొకేషన్ లోనే సాగుతుంది.

మధ్యభారతంలో శాంతి భద్రతల సమస్య ఉన్న ప్రాంతంలో ఎలెక్షన్ నిర్వహణలో భాగంగా తొమ్మిదిమంది తో కూడిన పోలీస్ బృందం బయలు దేరింది. దాని నాయకుడు మణికందన్. అతని వృత్తి అతని మనస్తత్వానికి సరిపడింది కాదు. ఐనా వృత్తి నిబద్దత ఉన్నవాడే. అతని బృంద సభ్యులకు ఆ ప్రదేశం కొత్తది.  డ్యూటి  కొత్తది. వారు చేయవలసిన పనికి సరిపడా వనరులు లేవు. వ్యక్తిగతంగా ఎవరి సమస్యలు వారికున్నాయి.   అన్నింటికీ మించి తొమ్మిదిమంది మధ్యా సఖ్యత లేదు.
మణికందన్ బృందానికి ప్రత్యర్ధి కనిపించడు. కాని యుద్ధసన్నద్ధులై ఉండాలి. ఆయుధ సంపత్తి లేదు. ఐతే వీరికి ప్రత్యర్ధులుగా వేరే వారు వచ్చారు. మణికందన్ బృందం విజయం సాధించింది.

***********

పై రెండు సినిమాలు చూస్తున్నపుడు కొనసాగింపుగాకాక రెండు వెర్షన్లు - (ఎలక్షన్ అధికారి, వారికి సహకరించే మిలటరి/పోలీస్ అధికారి ) వింటున్నట్టు ఉంటుంది.

రెండూ ఉత్కంఠభరితంగానే సాగుతాయి. ఐతే మూడ్ వేరుగా ఉంటుంది. ' ఉండ' సినిమాలో మ్యూజిక్   సినిమాతో కలిసి సాగకుండా ఒకింత ముందుకు వస్తుంది. అది సినిమా మూడ్ ను ఎలివేట్ మరింత ఎలివేట్ చేస్తుంది.

***********
 ఇరానియన్  సినిమా    ' సీక్రెట్ బాలెట్ ' 2001 లో వచ్చింది.  అతితక్కువ జనాభా ఉన్న దీవిలో ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఒక  ఉద్యోగిని పడవలో వచ్చింది. అంతకుమునుపే ఎలక్షన్ సామాగ్రి విమానంద్వారా డ్రాప్ చేయబడింది. అక్కడ ఉన్న సైనికుడొకరు ఆమెకు ఎన్నికల నిర్వహణలో సాయం చేయాలి. సైనికుని కి ఆ డ్యూటి అయిష్టం తో కూడినది పైపెచ్చు ఒక స్త్రీ ఆధ్వర్యంలో పని చేయటం. టాలరబుల్ లిమిట్స్ లో నే ఆమెను విసిగించాడు. ఆమె నిబద్ధతతో పని ముగించింది.

*********** 
సిక్రెట్ బాలెట్ సినిమాకు న్యూటన్ సినిమాకు కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఐతే న్యూటన్ సినిమా బాగా విస్తారితమైనది.చెప్పదలచుకున్నదికూడా మరింత ఎక్కువ. 
' ఉండ' సినిమా కు కథాస్థలం, నేపధ్యం ' న్యూటన్; ను పోలిఉన్నా చెప్పదలచింది మాత్రం రెలుక్టెంట్ లీడర్ షిప్, టీమ్ స్పిరిట్ లేకపోవటం  , వనరుల లేమి... వీటిని అధిగమించటం.

                                                                                            -ముళ్ళపూడి సుబ్బారావు
**********

  





Saturday, September 19, 2020

కభి కభి అదితీ జిందగీ మే యుహి కోయి అప్నా లగతా హై!

కభి కభి అదితీ జిందగీ మే యుహి కోయి అప్నా లగతా హై!


మూవీ: జానే తూ! యా జానే న (2008)
రచన: అబ్బాస్ టైర్ వాలా
సంగీతం: ఎ ఆర్ రెహ్మాన్
గానం: రషీద్ అలి

*************

 కొన్ని కొన్ని సార్లు జీవితంలో అదితీ!  కొందరు తనవారనిపిస్తారు
కొన్ని కొన్ని సార్లు అదితీ !  వారు దూరమైన   ఒక కల లా అనిపిస్తారు 

అలాంటిసమయంలో ఎవరైనా ఉబికే కన్నీటిని ఎలా ఆపగలరు?
అంతా సర్దుకుపోతుందని ఎవరైనా ఎలా అనుకోగలరు?

కొన్ని కొన్ని సార్లు  ఆనందాలు సరదాలు జీవితంలో లేవనిపిస్తుంది
కొన్నికొన్ని సార్లు రోజులు  కష్టం గా,  ప్రతిక్షణం శిక్షలా అనిపిస్తుంది

అలాంటి సమయంలో ఎవరైనా ఆనందంతో ఎలా నవ్వగలరు?
అంతా సర్దుకుపోతుందని ఎవరైనా ఎలా అనుకోగలరు?

కొంచెం ఆలోచించు..ప్రియతమా.. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో
నీ కంట కన్నీరు చూసి నేనూ విలపిస్తాను

పాడలేనప్పటికీ నేను పాడుతాను
అదితీ!  కొన్ని  కొన్ని సార్లు లోకం అంధకారమౌతుందని తెలుసు
కాని రాత్రి గడిచాక  ఉదయం వస్తుంది.

అదితీ ! హసించు ! హసించు ! హసించు....కొద్దిగా
లేకుంటే కొద్దిగా... కొద్దిగా... కొద్దిగా ...నవ్వు
నువ్వు ఆనందంగా ఉంటే లోకం ఆనందమయమౌతుంది
మబ్బులవెనకనుందు సూర్యుడు బయటకొస్తాడు .జీవితాన్ని పంచుతాడు

మత్తుతో కూడిన గాలి నీతో చెప్పేది విను
నీకు దూరమైన అదితి తో నీ కలయిక
ఏదో ఒకనాడు ఉంటుంది.
నీకు  తెలిసినా తెలియకున్నా ఏదో ఒకనాడు పూలు తిరిగి వికసిస్తాయి.
*********
- ముళ్ళపూడి సుబ్బారావు




Sunday, September 6, 2020

 నాజర్ నవ్వు వెనుక  కథ

తేవర్ మగన్ 1992 ( తెలుగు డబ్బింగ్ క్షత్రియ పుత్రుడు) సినిమా కు  కల్ట్ స్టేటస్ ఉంది. అంతకు మునుపు కూడా గ్రామకక్షలు, గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ, దాయాదుల మధ్య కక్షలు నేపధ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. దాయాదులమధ్య కొట్లాట సమస్యగా వచ్చిన ఈ సినిమా అలాంటి సినిమాలకు కొత్త నమూనాగా నిలిచింది.  కులానికి చెందిన పాత్రల ద్వారా నేటివిటీని పెంచి ,ఆథెంటిసిటీ తెచ్చిన సినిమా తమిళంలో ఇదే మొదటిది కావచ్చు.

ఒకే తండ్రి బిడ్దలైన పెరియ తేవర్, చిన్న తేవర్ మధ్య శత్రుత్వం ఉంది . ఇరువురికి వారి వారి వర్గాలున్నాయి. పెరియ తేవర్పెద్దకొడుకు తండ్రిదగ్గర ఉన్నాడు. దురలవాట్లకు లోనై శక్తిహీనుడయ్యాడు. రెండవ కొడుకు శక్తివేల్ లండన్ చదువుకుని తన ప్రేయసితో కలసి ఊరికి వచ్చాడు . మదరాసులో హోటల్స్ పెట్టాలని అతని ఆలోచన . అతని భావి ప్రణాఌక తండ్రిని బాధ పెట్టింది.  

ఊరిలో వర్గపోరు హెచ్చింది.పెరియ  తేవర్ ప్రత్యర్ధులు బలపడుతున్నారు. అతను కొడుకును ఊరిలోనే ఉండి తన వర్గ సంక్షేమం చూడమన్నాడు. అనుకోని సంఘటనలతో పెరియ తేవర్ మరణించాడు.

అతని అంత్యక్రియలకు దాయాదులు హాజరయ్యారు. మరణించిన పెరియతేవర్ పెద్ద కొడుకు తాగి ఉన్న మత్తులో తండ్రికి   తలకొరవి పెట్టలేక నేలపై కూలబడ్డాడు. అతని స్థితి ని చూస్తున్న చిన్న తేవర్ కొడుకు మయ తేవర్   నవ్వుకుంటున్నాడు . పెదనాన్న మరణం అతన్ని కదిలించలేదు. వరసకు సోద రుడయ్యే వ్యక్తి అసహాయత అతనికి అమితానందాన్నిస్తుంది .  ఆస్తి, ఆధిపత్యం   రక్తసంబంధీకుల మధ్య బంధాలను తెంపేస్తుంది.  ఆ దాయాది పాత్ర ను నాజర్ ధరించాడు. 'నాజర్ నవ్వు'  ఎన్నింటినో గుర్తు చేస్తుంది.  ఆ నవ్వు పాతికేళ్ళుగా గుర్తుకొస్తునే ఉంటుంది.

*******

తేవర్ మగన్ సినిమా కథ ఒక సారి రాసినది కాదు. ఎప్పటినుండో కమల్ హసన్ తీయదలచుకున్న సబ్జెక్ట్  ఈ సినిమా గా ఎవాల్వ్ అయ్యింది. సినిమా పై 'గాడ్ ఫాదర్' వంటి సినిమాల ప్రభావం అటుంచితే కమల్ హసన్ ను ఎంతగానో ఆకర్షించిన  కన్నడ సినిమా 'కాడు' (1973) ప్రభావం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది.

ప్రపంచ సినిమా , ఫిల్మ్ సొసైటీల ద్వారా డెబ్భైలనాటికి కొందరికి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ సినిమాలో వాస్తవిక ధోరణిని అందుకున్న వారిలో గిరీష్ కర్నాడ్ ఒకడు. దర్శకునిగా, నటునిగా అతనిదో ప్రత్యేక ఒరవడి.  'కాడు' (అడవి) సినిమాను అదే పేరుతో వచ్చిన కన్నడ నవల ఆధారంగా తీసాడతను.  

రెండు గ్రామాలు. వాటిని వేరుచేస్తూ ఒక అడవి. రెండు గ్రామాలమధ్య కొన్ని తప్పనిసరి సంబంధాలు. ఈ నేపధ్యం లో కథ సాగుతుంది. ఎనిమిదేళ్ళ  పిల్లవాడు జరిగే సంఘటనలన్నింటినీ తన దృష్టికోణం నుండి చూస్తూ ఉంటాడు. గ్రామాల మధ్య కక్షలు, రక్తపాతం, తద్వారా పిల్లవానిలో కలిగే భయం అతని కి   అంతకు ముందు అడవి పట్ల ఉండే భయాన్ని మించుతుంది. ఒకటి ప్రాకృతమైన భయం, రెండవది మనుషులు సృష్టించిన భయం.

ఈ సినిమాలో రెండుగ్రామాలకు చెందిన ఇద్దరు ప్రత్యర్దులు ఒక పంచాయితీలో కలుసుకోవాల్సి వచ్చింది.    వారిద్దరిలో ఒకరు  ఆ  పంచాయితీలో ఆత్మ రక్షణలో పడ్డాడు. అతని స్థితి చూసి రెండో ఆయన పరిహాసం-క్రౌర్యం కలిపి నవ్వుకుంటుంటాడు. ఆ పాత్ర పేరు శివగంగ. పాత్రధారి 'లోకేశ్'.

  అక్కడ నాకు తేవర్ మగన్ లో   నాజర్ నవ్వుకు మూలం దొరికింది. 

'కాడు ' సినిమా చూస్తుంటే పదేపదే తేవర్ మగన్ జ్ఞప్తికి వస్తుంటుంది. 1973 నాటి 'కాడు' సినిమాలో ఎనిమిదేళ్ళ పిల్లవాడు  1992 నాటికి తేవర్ మగన్ సినిమాలో 'శక్తివేల్ ' గా మారాడు. 'కాడు' సినిమా లో ప్రధాన పాత్ర పేరు 'చంద్రె గౌడ'  (ఇది కులాన్ని తెలియజేసేదే). 

-ముళ్ళపూడి సుబ్బారావు

******




కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

  కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3) కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్న...