Friday, August 14, 2020

మహమ్మద్ రఫీ-2

 మహమ్మద్ రఫీ-2

(ఇటీవలి సినిమాలలో రఫీ ప్రస్తావన- రఫీ తెలుగు పాటలు))
2016 వచ్చిన ఒక హిందీ సినిమాలో అనూష్కశర్మ పాత్ర హీరో పాత్రధారి రణబీర్ కపూర్ తో “ మహమద్ రఫీ గాతే నహీ! రోతే హై” అంటుంది. సినిమా పేరు ‘యే దిల్ హై ముష్కిల్’.
ఈ సినిమా పేరును గుర్తుకుతెచ్చే పాట (యే దిల్ ముష్కిల్ జీనా యహా) సి. ఐ. డి (1956) సినిమాలో ఉంది. . సరదాగా సాగుతూ ‘బొంబై’ నగరంలో జీవితాన్ని వ్యంగ్యంగా వర్ణిస్తూంది. హాస్య నటుడు జానీవాకర్ పై చిత్రీకరింపబడింది. పాడిన వారు మహమ్మద్ రఫీ- గీతాదత్.
రణబీర్ కపూర్ తండ్రి రిషికపూర్ కు మహమద్ రఫీ హాస్యగీతాలు, ప్రేమగీతాలు, సరదా గీతాలు, ఖవ్వాలీలు, గజళ్ళు ..ఇలాఅన్ని రకాలపాటలు పాడాడు. అవి రిషి ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డాయి.
నిర్మాత కరణ జోహార్ తండ్రి ఐదు దశాబ్దాలు చిత్రరంగంలో ఉన్నాడు. అతడి తొలిఘనవిజయం ‘దోస్తానా’ సినిమాలో మహమ్మద్ రఫీ రెండు ఉత్తమగీతాలు ఆలపించాడు.
నిర్మాత, కథానాయకుడు ఇద్దరూ సినీరంగ వారసత్వం తో వచ్చినవారు. ఒకతరంముందు రఫీ సంబంధం ఉన్నవారు. వారినుంచి ఇది క్షమార్హం కాదు.చరిత్ర పట్ల వారి బాధ్యతారాహిత్యాన్ని ఇది చెబుతుంది.
మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉదహరించబడ్డదేదైనా మెజారిటీ ప్రజానీకానికి చేరుతుంది. అవినిజాలుగా చలామణి ఔతాయి. పదిహేనేళ్ళక్రితం ఒక కూల్ డ్రింక్ అడ్వర్టైజ్ మెంట్ లో గాయకుడు సైగల్ పాటను చిన్నబుచ్చినపుడు సైగల్ అభిమానులు నొచ్చుకున్నారు.
ఇలాటివాటికి భిన్నమైనవీ ఉంటాయి. ఊహలు గుసగుసలాడే (2014) సినిమాలో హీరోయిన్ పాత్రను మహమ్మద్ రఫీ అభిమానిగా చూపారు. (ఆ పాత్ర ఢిల్లీ లో పుట్టి పెరిగింది). బహుశా అవసరాల శ్రీనివాస్(దర్శకుడు) వ్యక్తిగత అభిరుచి ఇలా వ్యక్తమై ఉండవచ్చు.ఇప్పటి యువతలో కొందరికి పాత హిందీ పాటల పట్ల అభిరుచి ఉండటం నేనూ గమనించాను.
మహమద్ రఫి- తెలుగు పాటలు.
మహమద్ రఫీని తెలుగుసినిమాకు జగ్గయ్య ‘పదండి ముందుకు(1962) ‘ ద్వారాపరిచయం చేసాడని చదివాను. ఐతే ఆ సినిమాలో పాటలు నాకు అందుబాటులోకి రాలేదు. తర్వాత చిత్తూరు నాగయ్య సినిమా’ భక్త రామదాసు’ లో రఫీ ఒక పాడారు. ఐతే అది తెలుగు పాటకాదు కాని తెలుగు సినిమాకోసం రికార్డ్ చేయబదింది. కబీర్ పాత్రధారి గుమ్మడి పై చిత్రీకరించారు.
రఫీ సామాన్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది మాత్రం ‘భలే తమ్ముడు(1969)’ సినిమాపాటలతోనే. ఆ సినిమాలో ఆరు పాటలు రఫీ పాడారు. సంగీత దర్శకుడు టీ.వి. రాజు .ఈ సినిమాలో హిట్ సాంగ్స్ అనదగినవి - ఎంతవారు గాని ( మాతృక ‘చైనా టవున్’ లో పాట బార్ బార్ దేఖో కు అనుసరణ- ఈ పాట ఆధారంగాచేసుకునే అజిత్ డబ్బింగ్ సినిమా ‘ఎంతవారు కాని (2015) పెట్టారు), గోపాల బాల నిన్నే కోరి, ముద్దుల తలపులు మొదలాయే, నేడే ఈ నాడే . ఈ సినిమా పాటల్లో నేను వినగలిగేవి చివరి మూడు. ఇష్టపడేది - నేడే .. ఈనాడే పాట ( ఈ పాట ను మణి శర్మ అల్లరి పిడుగు (2005) లో రిమిక్స్ చేశాడు. అది వినగలిగే పాట.)
1970 లో వచ్చిన 'తల్లా? పెళ్ళామా?'లో ఖవ్వాలీ తరహా పాట టి.వి. రాజు స్వరకల్పన లో పాడారు.
తర్వాత ‘ రామ్ రహీమ్ (1974)’ లో రెండు పాటలు పాడాడు. ‘నేను కత్తుల రత్తయ్యనులే ‘పాట అప్పట్లో ఎక్కువ వినపడేది. దీనికి ఎస్. రాజేశ్వర రావు సంగీతమిచ్చారు. దాశరధి గీతరచన చేశారు.
1976 లో హిందీ సినిమా ‘గీత్’ ఆధారంగా వచ్చిన ‘ఆరాధన’ సినిమాలో ఐదు పాటలు పాడాడు.సాలూరి హనుమంతరావు (ఎస్. రాజేశ్వరరావు సోదరుడు) సంగీతదర్శకుడు. ‘ఆరాధన’ సినిమా విజయవంతమయ్యింది,పాటలు బాగా జనబాహుళ్యం లోకి వెళ్ళాయి. నేనైతే ఏ పాటనూ ఇష్టం గా వినలేను.
తర్వాత అక్బర్ సలీమ్ అనార్కలి సినిమాలో ఐదు పాటలు పాడాడు. దీనికి హిందీ సంగీతదర్శకుడు ‘చితల్కర్’ గా పిలవబడే ‘సి. రామచంద్ర’ సంగీతంఅందించారు. హిందీ ‘అనార్కలి (1953)’ సినిమాకు ఈయన సంగీతదర్శకత్వం వహించారు. (తెలుగు అనార్కలి(1955) లో ‘రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా’ కు ఆధారం ఇతని పాట ‘జాగ్ దర్ద్ ఇష్క్).
అందులోని ఒకసోలో, నాలుగు యుగళగీతాలు జనామోదంపొందాయి. సినిమా దృశ్యకావ్యం కాదు కాని శ్రవ్యకావ్యమే. రఫీ సోలో ‘తారలెంతగా మెరిసేనో’ యుగళగీతాలు ‘సిపాయీ- ఓ సిపాయీ’, ‘తానే మేలిముసుగు తీసి’,’రేయి ఆగి పోని’, ‘కలుసుకుంటె గుబులాయె’ ప్రత్యేకంగా ప్లే చేసుకుని వినకపోయినా ఎక్కడ వినవచ్చినా చెవిఒగ్గగలిగేవే.
చివరిగా ‘తిరుపతి వెంకటేశ్వర కల్యాణం (1979) లో ఒకపాట పాడాడు.ఈ పాటనూ సి. రామచంద్ర నే స్వర పరచారని సినీ సంగీత విమర్శకులు వి.ఎ.కె. రంగారావు అన్నారు. రాం రహీం లో పాటలు మినహా, రఫీ పాడిన తెలుగు పాటలన్నింటినీ రాసిన సి. నారాయణరెడ్డి, రఫీ కి తెలుగు ఉచ్ఛారణలో సహకరించానని ఒకసందర్భంలో చెప్పారు.

No comments:

Post a Comment

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

  కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3) కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్న...