తండ్రులు- కొడుకులు
కథానాయకుడు ఒక పోలీస్ ఆఫీసర్. డ్యూటీ కి ప్రాణమిచ్చేవ్యక్తి. భార్యను, కొడుకును అమితంగా ప్రేమిస్తాడు. చిన్నవయసులోనే కొడుకులో నేరప్రవృత్తి చూసివిలవిలలాడాడు. తప్పని పరిస్థితుల్లో అతణ్ణి బాల నేరస్తులపాటశాలలో చేర్చాడు. కొడుకు పెద్దవాడై తిరిగి వచ్చేసరికి తండ్రి ఎస్. పి. గా పదోన్నతి సాధించాడు పెద్ద హోదాలో ఉన్నాడు.
తిరిగివచ్చిన కొడుకు తండ్రిపట్ల కోపంతోనే ఉన్నాడు. తల్లికోరికమీద ఇంటిలో ఉండటానికి ఒప్పుకున్నాడు.తల్లి తండ్రులు అతని వివాహ ప్రయత్నాలు చేసారు. అతని గతం అందుకు అవరోధం అయ్యింది. కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెఌచేసుకుని ఇంటికి తెచ్చాడు.
నగరంలో పెద్ద దొంగతనం జరిగింది. కేసు దర్యాప్తు జరుగుతుంది. డ్యూటిలో భాగంగా ఎస్.పి. వేరే ప్రాంతానికి వెళ్ళాడు.
ఎస్.పి. ఇంటికి వడ్డివ్యాపారి వచ్చాడు. తన బాకీ నిమిత్తం ఎస్.పి. ఇచ్చిన చెక్కు చెల్లపేదని ఎస్.పి.ని అవమానిస్తూ మాట్లాడాడు.ఇంటి దగ్గరే ఉన్న కొడుకు అతనితో ఘర్షణ పడ్డాడు. తండ్రిని అవమానించటం తో అతను ఆవేశపడ్డాడు. తన స్నేహితులతో మాట్లాడి డబ్బు తెప్పించి వడ్డీ వ్యాపారికి చెల్లు వేశాడు.
కొద్దిరోజుల తర్వాత ఇంటిలో కొడుకు పుట్టిన రోజు జరుగుతుంది. ఎస్.పి. కుటుంబసభ్యులతో కూడి అనేకమందితో వేడుక చేస్తున్నాడు. ఒక పోలీస్ వచ్చి ఎస్.పి. ఏదో వార్తతెచ్చాడు. ఎస్.పి. లోపలికి వెఌ పోలీసు దుస్తులలో బయటకు వచ్చి అందరి మధ్య కొడుకును దొంగతనం నేరం మీద అరెస్ట్ చేయించాడు.
వడ్డీ వ్యాపారి వ్యవహారం ఎస్.పి. నడిపిన నాటకం. కొడుకును ఆవేశపరచి అతనితో దొంగ సొత్తును బైటకు లాగాడు.
దీనితర్వాతా కథ నడుస్తుంది. కొడుకు మరిన్ని నేరాలు చేస్తున్నాడు. కుటుంబానికి దూరమయ్యాడు. తల్లి అంత్యక్రియలకుకూడా రానంత ద్వేషం తండ్రిపట్ల పెంచుకున్నాడు. చివరకు దేశద్రోహం చేస్తూ తండ్రి చేతుల్లో మరణించాడు. డ్యూటి గొప్పగా నిర్వర్తించించినందుకు ఎస్.పి, కి బంగారు పతకం లభించింది. ఈ తమిళ సినిమా పేరు తంగ పతకం (1974-బంగారు పతకం) .శివాజి గణేశన్ పాత్ర పేరు ఎస్.పి. ఛౌధరి.
***********
ఇరండిల్ ఒంద్రు ( రెంటిలో ఒకటి) పేరుతో జె. మహేంద్రన్ (నటుడు ,రచయిత, దర్శకుడు) ఒక సాంఘిక నాటకం రాసాడు. నాటకం లో ప్రధాన పాత్ర ఎస్. పి. కి బెంగాలీ పేరు 'ఛౌధరి' సూట్ అవుతుందని ఆ పేరు పెట్టాడట. ఆనాటకాన్ని శివాజి గణేశన్ తంగపతకం పేరుతో స్వయంగా నిర్మించాడు.
సినిమా మొత్తం గొప్పడ్రామాతో నడుస్తుంది. ప్రధానపాత్రలు నాలుగు -తల్లీ, తండ్రీ, కొడుకూ కోడలు. ప్రధాన లోకేషన్లు , ఎస్. పి. ఇల్లు. పోలీస్ స్టేషన్, కొడుకు ఇల్లు. ప్రతీ సన్నివేశం లోనూ డ్రమెటిక్ సంభాషణలుంటాయి. సమాంతరంగా సాగే కథకు సంబంధం లేని కామెడి ఎపిసోడ్ ను, కొద్దిసేపటి ఔట్ డోర్ భాగాన్ని తీసేస్తే సినిమా ఇంచుమించు నాటకం లానే సాగుతుంది. కాని పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తాయి. రోమాంఛితుల్ని చేస్తాయి.
***********
ఈ సినిమాను అల్లు రామలింగయ్య 'గీతా ఆర్ట్స్ ' బానర్ పై 'బంగారు పతకం' (1975?) పేరుతో తెలుగు లో డబ్ చేసారు. శివాజీ గణేశన్ కు నటుడు జగ్గయ్య డబ్బింగ్ చెప్పారు. తెలుగులో కూడాసినిమా ప్రేక్షకులకు ప్రసంశలు పొందింది.
**********
రోజా మూవీస్ సంస్థ 'వేటగాడు' (1979) సినిమా ద్వారా అనూహ్య విజయాన్నందుకుంది. వారి మలిప్రయత్నం 'కొండవీటి సింహం' (1981). ఈ సినిమా 'తంగపతకం ' ఆధారంగానే వచ్చింది. తమిళసినిమాలో ఉన్న డ్రామా తో ముడిపడి ఉన్న పాత్రలతో పాటు మరికొన్ని పాత్రలు చేరాయి. తమిళ మాతృకలోని కామెడి ట్రాక్ స్థానాన్ని గ్లామరస్ సాంగ్స్, పూర్తిస్థాయి విలనీ భర్తీచేసాయి. సినిమా ఆసంవత్సరపు భారీ హిట్ గా నిలిచింది. ఐతే మాతృక లోని ఎమోషనల్ అంశపు సాంద్రత తెలుగులో తగ్గిందనిపిస్తుంది. ఎన్.టి. ఆర్ పాత్ర పేరు ఎస్.పి. రంజిత్ కుమార్
***********
అమితాబ్ సూపర్ స్టార్ గా మారిన తరుణంలోనే దిలీప్ కుమార్ తన నటప్రస్థానానికి కొమ్త విరామమిచ్చాడు. అతని పునరాగమసమయంలో నిర్మాతలు ముషీర్- రియాజ్ లు గొప్ప కాంబినేషన్ కోసం ప్రయత్నం చేసారు. ఆ కాంబినేషన్ " దిలీప్ కుమార్,అమితాబ్ బచన్, షోలే సినిమా దర్శకుడు రమేష్ సిప్పీ, కథారచయితలు సలీమ్ - జావేద్ ". వారితో పాటు ఆర్ డి బర్మన్, ఆనంద్ బక్షిలు ఉన్నారు. దీనికై వారు 'తంగపతకం' ను మూలకథగా ఎంచుకున్నారు. 'శక్తి ' (1982) పేరుతో ఆ సినిమా వచ్చింది.
మూలకథకు ఇంప్రూవైజేషన్ అనదగ్గ మార్పులు జరిగాయి. తండ్రి పట్ల కొడుకు ద్వేషానికి కారణాలు చెప్పబడ్డాయి. కొడుకునేరాన్ని పట్టుకోవటానికి 'తంగపతకం' లో ఎస్.పి. చౌధరి ఉపయోగించిన (ఒకవిధంగా హిట్టింగ్ బి లో బెల్ట్) కుటుంబ/తండ్రి గౌరవం అంశం హిందీ లో కనిపించదు. కొడుకు పాత్ర ప్రవర్తనకు హేతువు కనిపిస్తుంది. తంగపతకం సినిమా లో సంభాషణ ఆధారంగా ఎక్కువ కథ నడుస్తుంది. 'శక్తి ' సినిమా సంభాషణల నిడివి తగ్గింది. పాత్రధారులకు నటనకు గొప్ప అవకాశమిచ్చింది. సినిమా మొత్తం ఒక ప్రత్యేకమైన మూడ్ లో నడుస్తుంది. ప్రేక్షకులకు తాము ఏ పాత్రలో ఐడెంటిఫై కావాలో తేల్చుకోలేనట్టు ఉంటుంది.
సినిమాలో కొన్ని సంభాషణలు:
డిసిపి అశ్వనీకుమార్ (తండ్రి):
సత్యం వైపే ఉండాలని ఒట్టు పెట్టుకున్నవారికి ప్రపంచం కఠినమైన పరీక్షలు పెడుతుంది.
*****
విజయ్ (కొడుకు):
మా తండ్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నేను కొడుకును . మరో భార్యకు చట్టం కొడుకు.
******
క్లైమాక్స్ లో తండ్రీ కొడుకుల సంభాషణ:
కొడుకు: "మీ పట్ల ప్రేమను చెరిపేయాలని ఎంతో ప్రయత్నించాను. మిమ్మల్ని ద్వేషించాలని ఎంతో కోరుకున్నాను.కాని మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఎందుకిలా?"
తండ్రి: "ఎందుకంటే ! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను."
కొడుకు: "మరి నాకెందుకు చెప్పలేదు నాన్నా!"
పై సినిమాలో ప్రత్యేకంగా 'శక్తి ' సినిమాలో కనిపించె దుఃఖానికి కారణమేది అంటే నాకనిపించేది - భావాలను వ్యక్తీకరించ(లే)కపోవటం.
- ముళ్ళపూడి సుబ్బారావు


No comments:
Post a Comment