Showing posts with label akira kurosowa. Show all posts
Showing posts with label akira kurosowa. Show all posts

Friday, August 14, 2020

తెలుగు తెరపై అకిరా కురసావా

 తెలుగు తెరపై అకిరా కురసావా.

‘త్రిమూర్తి ‘ బానర్ తో నిర్మాత ‘ డూండీ’ సమర్పణలో ‘కృష్ణ’ ‘కె.ఎస్. ఆర్. దాస్’ కాంబినేషన్లో (1975 నుండీ) ‘దొంగలు’ మకుటంతో వరసగా సినిమాలు వచ్చాయి. భలే దొంగలు, దొంగలకు దొంగ వచ్చాక మూడో సినిమాగా ‘దొంగలవేట’ సినిమా వచ్చింది. మొదటిరెండు సినిమాలకు ఆధారం శశి కపూర్ హీరోగా వచ్చిన హింది సినిమాలైతే , మూడో దానికి వినోద్ ఖన్నా హీరోగా ‘ఇన్ కార్’ సినిమా ఆధారం. ఇన్ కార్ సినిమాకు ఆధారం జాపనీస్ దర్శకుడు అకిరా కురసావా సినిమా ‘ హై అండ్ లో’ (1963). ‘ అకిరా కురసావా’ సినిమా’ సెవెన్ సమురాయ్’ స్పూర్తి తోవచ్చిన ‘మేరా గావ్-మేరా దేశ్’ ‘ షోలే’ సినిమాల విజయం, నిర్మాతను మరో కురసావా సినిమాను హిందీలో తెరకెక్కించటానికి పురికొల్పింది.
*****
కురసావా తీసిన సాంఘిక చిత్రం హై అండ్ లో’. ఒక కిడ్నాపర్ ను పోలీసు బృందం పట్టుకోవటం సినిమా కథ. జానర్ గా ‘క్రైమ్’ లేదా ‘యాక్షన్ ‘ లేదా ‘డిటెక్టివ్ ‘ సినిమాగా చెప్పుకోవచ్చు. ఐతే ఈ సినిమాను అలా జనరలైజ్ చేసెయ్యలేము.సినిమా లో కార్పొరేట్ ,బోర్డ్ రూమ్ వ్యవహారాలు, బిజినెస్ లో ప్రాఫిట్ , ఎథిక్స్ ప్రాధాన్యాలు , వ్యాపార విలువలు, వ్యక్తిగత విలువలు, విలాసవంతమైన జీవితాలు, దుర్భర జీవితాలు, క్రైమ్ , క్రైమ్ కు ప్రేరేపణ, ఇవన్నీ చర్చింపబడతాయి. నేషనల్ షూ కంపనీ లో డైరెక్టర్ ఐన కథానాయకుడు ‘ గొండో’ మిగతా డైరెక్టర్లతో కంపనీ తయారుచేసే షూస్ నాణ్యత విషయంలో రాజీపడకుండా ఘర్షణ పడ్డాడు. వారు తనను కంపనీ నుండి బయటకుపంపకుమునుపే‘కంపనీ’ని తన అధీనంలో తెచ్చుకుందామనుకున్నాడు. అందుకోసం తన సర్వఆస్తుల్నీ తనఖాపెట్టి డబ్బు సేకరించాడు.
అదే సమయంలో తన కొడుకును కిడ్నాప్ చేసారని ఫోన్ వచ్చింది. కొడుకును వదలటానికి కి కిడ్నాపర్ అసాధారణమైన మొత్తాన్ని అడిగాడు. 'గొండో' జీవితకాలం సంపాదన అది. ఐనా కొడుకుకోసం ఆమొత్తాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఈ లోగా, కిడ్నాపర్ పొరపాటుగా తన కొడుకుని కాకుండా, తన డ్రైవర్ కొడుకు ను కిడ్నాప్ చేసాడని తెలిసింది. కిడ్నాప్ గురించి పోలీసులకు తెలిపారు. పోలీసు బృందం 'గొండో' ఇంటికి వచ్చింది. కిడ్నాపర్ ఫోన్ కాల్ ను పోలీసులు ట్రాప్ చేస్తున్నారు.
కిడ్నాపర్ తను కోరిన మొత్తాన్ని ఇవ్వకపోతే డ్రైవర్ కొడుకును చంపుతానని చెప్పాడు. 'గొండో' డ్రైవర్ కొడుకు కోసం తన సర్వస్వాన్ని కోల్పోవటానికి పడ్డాడు. కిడ్నాపర్ అడిగిన సొమ్మును అతను చెప్పిన పద్ధతిలో రైలు కిటికీనుండి బైటకు విసిరాడు. ఆ తర్వాత నేరస్తుడ్ని పట్టుకోవటంలో డీటెయిల్డ్ పోలీసు,డిటెక్టివ్ ప్రొసీజర్ తో సినిమా సాగుతుంది.
సినిమా లో కిడ్నాపర్ కనిపించేది కొద్దిసేపే. అతని కారెక్టర్ మిగతావారి మాటలద్వారాను, రియాక్షన్స్ ద్వారాను ప్రేక్షకులకు అవగతమౌతూ వస్తుంది. ఫోను లో కాకుండా కిడ్నాపర్ తెరపై కొన్ని మాటలే చెబుతాడు. తను చేసిన పనికి అతను పశ్చాత్తపపడుతున్నట్టు ఉండవవి. అతనందుకు ఎలా ప్రేరేపితుడయ్యాడన్ని చెబుతాడు.
“ శీతాకాలం లో గడ్డగట్టేంత చలి ,వేసవిలో భరింపరాని వేడితో ఉండే నాగదిలో నేను నిద్రపట్టక ఉంటాను. నా చిన్న గది నుండి, నీ ఇల్లు స్వర్గంలా కనిపిస్తుంది. రోజు రోజుకు నీపట్ల నాకు ద్వేషం పెరుగుతుంది. నేను బ్రతకటానికి అదే హేతువుగా మారింది. ఇంకా, అదృష్టవంతులు, దురదృష్టవంతులలా పేదరికాన్ని చవిచూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నీ సానుభూతి పొందడానికి నాకష్టాల కథ నీకు చెప్పను. క్రితంసంవత్సరం నాతల్లి చనిపోవటం నాకు అనందాన్నిచ్చింది. ఆమె బాధగొలిపేఏడుపును నేను వినక్కరలేదు. నాకు చావంటే భయంలేదు.నాకు నరకమంటే భయంలేదు. నేను పుట్టినప్పటినుండీ నాబ్రతుకు నరకమే”.
సినిమాపేరు ‘హై అండ్ లో’ ( ‘ఎత్తు - పల్లం’) రెండు భిన్న ప్రపంచాలగురించి చెబుతుంది. సినిమా పేరు ను ‘స్వర్గం- నరకం’ గానూ చెబుతారు. తెలుగు లో ‘ ఊర్ధ్వ జగత్తు- అధోజగత్తు’ అనుకోవచ్చు. సినిమాలో మొదట్లోనే రెండు ఎక్స్ట్రీమిటీస్ ‘బూట్-హ్యాట్’ విషయంలో ప్రస్తావించబడతాయి. హ్యాట్ తలపైన ఉంటుంది..బూట్లు మనిషి బరువును మోస్తాయి. ఈ రెంటినీ ఒకేరకంగా చూడలేము.సినిమాలో చాలాభాగం కొండపైన ఉన్న 'గొండో' ఇంటి పై అంతస్తులోన జరుగుతుంది. అక్కడినుండి లోయలాంటి ప్రాంతంలో నేలబారు మనుషులుండే ఇళ్ళు కనిపిస్తుంటాయి.(గొప్పగుర్తింపు పొందిన 'పారసైట్'(కొరియన్,2019) సినిమా పైన 'హై అండ్ లో' సినిమా ప్రభావం కనపడుతుంది.)
‘హై అండ్ లో’ సినిమాలో నేరం- నేరపరిశోధన భాగాన్ని మాత్రం తీసుకుని హిందీ సినిమా ‘ఇన్ కార్’ తయారయ్యింది. ఇందులో మాతృకలో ఉన్న సూక్ష్మ, సున్నితాంశాలు కనపడవు. కిడ్నాప్ చేసిన వ్యక్తి నేర నేపధ్యం ఉండదు. ఒరిజినల్ సినిమాలో ఫిజికల్ గా స్క్రీన్ మీద ఎప్పుడొ కాని కనపడని కిడ్నాపర్ పాత్ర హిందీలోకి వచ్చేసరికి ఎంతో స్క్రీన్ టైము ను ఆక్రమిస్తుంది. ఎంతో సంక్లిష్టతతో ఉన్న 'గొండో' పాత్ర, హింది సినిమాలో ఫ్లాట్ గా కనపడుతుంది. పోలీసులు చేసిన ‘టీమ్ వర్క్’ హిందీ సినిమాలో ఒక్క వ్యక్తికి (హీరో పాత్ర, మూల చిత్రంలో ప్రాధాన్యత అంతగా లేనిది) అపాదితం అయ్యింది. హీరోయిన్ పాత్ర కొత్తగా వచ్చింది. ఈ మార్పులు మరికొన్ని చేర్పులతో వచ్చిన ‘ఇన్ కార్’ పకడ్బందీ స్క్రీన్ ప్లే తో మంచి నిర్మాణవిలువలతో విజయవంతమైన సినిమాఅయ్యింది.
ఈ సినిమా తెలుగులోకి వచ్చేసరికి సబ్జెక్ట్, క్వాలిటీ పరంగా మరింత రసహీనమయ్యింది. హిందీ సినిమాకు కూడా పేలవమైన అనుకరణ గా మిగిలింది.ఐనా అప్పటి తెలుగు ప్రేక్షకులు ‘దొంగల వేట’ సినిమా చూసి కొత్తదనం ఫీలయ్యారంటే కారణం మాతృకలో ఉన్న బలం.

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

  కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3) కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్న...