’డాన్’(1978) #Don_amitabh
ఔర్ ఏక్ ‘డాన్’ కో బనానా ముష్కిల్ నహీ! న మున్కిన్ హై!
రక్త సంబంధీకులలో తప్ప ,అచ్చు గుద్దినట్టు ఒకరిని పోలిన మనుషులు మరొకరుండటం అసాధారణ విషయం. ఐతే సాహిత్యంలోనూ, సినిమాలలోను ఇది పలుమార్లు కనపడుతూంటుంది. ఫ్రెంచ్ విప్లవనేపధ్యంలో వెలువడి, వరల్డ్ క్లాసిక్ గా పేరుగాంచిన ‘ టేల్ ఆఫ్ టు సిటీస్’ నవలలో సైతం కథానాయకుని పోలికతో ఉన్న లాయర్ ఉండటం, వారిపోలికలు, కథను లో మలుపులకు, డ్రామాకు దోహదం చేసాయి.ఐతే మెజారిటీ సినిమాలలో ఒకరిని పోలిన ఒకరు చివరకు అన్నదమ్ములు గా తేలుతారు. అరుదుగా రక్తసంబంధీకులుకాకుండాఉంటారు.
దర్శక నిర్మాత ‘ శక్తి సామంత’ వంగదేశీయుడు. కలకత్తా నేపధ్యంతో అతను కొన్ని సిన్మాలు తీసాడు. కలకత్తాలో ఒక లాండ్ మార్క్ ఐన ‘హౌరా బ్రిడ్జ్’ పేరుతో తీసిన క్రైము సినిమా విజయంసాధించింది. తర్వాత కలకత్తాలో ఒక ప్రాంతమైన ‘ చైనాటవున్’ పేరుతో మరో నేరనేపధ్యపు సినిమా తీసాడు. సినిమాలో చెప్పనటువంటి కథ ‘చైనా టవున్’ పేరుకు ఉంది.
హక్కా (జాతి?) చైనీయులు బ్రిటీష్ యేలుబడి కాలంలో బెంగాలు ప్రాంతానికి వచ్చారు.ప్రత్యేకంగా నల్లమందు యుద్ధాలతర్వాత. ‘హక్కా’ అంటే చీనీభాష లో ‘ అతిధి’ అని అర్ధం ఉంది. కానీ అలా వచ్చిన వారు చాలామంది కలకత్తాలో స్థిరపడ్డారు. తోళ్ళపరిశ్రమ (టానరీ) లో వారు ఉపాధి వెతుక్కున్నారు. టానరీలలో పనిచేయటం మిగతావర్గాలు నీచమైనదిగా భావించటంవారికి వరమయ్యింది. టానరీలు, పాదరక్షలతయారీవంటి పనులతో పాటు ‘నల్లమందు’వ్యాపారంకూడాచేసారు.
భారత్ స్వతంత్ర దేశం అయ్యేంతవరకూ వారి వ్యాపారాలు చట్టబద్దమైనవే. వారు ఇక్కడకు వచ్చి అప్పటికి సుమారు నూటయాభైయేళ్ళు అయ్యింది. వారిసంస్కృతిప్రతిబింబిస్తూ స్కూళ్ళు, ప్రార్ధనామందిరాలతో కూడిన కాలనీలవంటివి ఏర్పడ్డాయి. ఐతే స్వాతంత్రానంతరం వారి వ్యాపారాలు కొన్ని చట్టవిరుద్ధమైనాయి. రాజకీయకారణాలతో చైనా భారత్ కు శత్రుదేశంగాను మారింది.
అలాంటి నేపధ్యంలో శక్తి సామంతా, కలకత్తా చైనాటవున్ లో ‘ చెప్పుల షాపు’ వెనుక జరిగే చీకటి వ్యాపారాన్ని ఫోకస్ చేస్తూ,ముఖ్యప్రతినాయకుని చైనీయునిగా చూపుతూ సినిమా తీసాడు. చైనా తో భారత్ యుద్ధకాలంలోనే సినిమా విడుదల అయ్యింది.
*****
‘ లీగసీ ఆఫ్ ఎ స్పై’ అనె ఇంగ్లీష్ నవల ఆధారంగా హిందీలో ఒకటిరెండు చిన్నసినిమాలు వచ్చాయి. అందులోని అంశాలకు చైనాటవున్ నేపధ్యాన్ని కలిపి శక్తి సామంతా ‘చైనాటవున్’ ప్లాన్ చేసాడు.
సినిమాలో ప్రధాన అంశం, చీకటి సామ్రాజ్యం ‘కింగ్ పిన్’ లాంటి వ్యక్తి స్థానంలో పోలీసులకు సంబంధించిన వ్యక్తిని ప్రవేశపెట్టి ఆ సామ్రాజ్యాని కూలగొట్టటం.
పోలీసులకు ప్రధాననేరస్థుడు దొరికాడు. అతనితో పోలీసులు రహస్యాలు చెప్పించలేకపోతున్నారు. అదేసమయంలో పోలీసులు ఒక వ్యక్తిని చేసారు. అతను అచ్చుగుద్దినట్టు దొరికిన నేరస్థుని పోలిఉన్నాడు. అతనిని ఒప్పించి పోలీసులు నేరస్థుని స్థానంలో ప్రవేశపెట్టారు. ఒకే పోలికతో ఉన్న ఆ ఇద్దరూ చిన్నప్పుడే విడిపోయిన అన్నదమ్ములు.
పైకథకు , సూపర్ హిట్ గీతాలు , షమ్మీ కపూర్ నటన తోడై సినిమా జనరంజకమయ్యింది.
కథలో ఉన్న యూనివర్సల్ అప్పీల్ సినిమాను దక్షిణభారతానికీ తెచ్చింది. తమిళంలో ఎమ్. జి . రామచంద్రన్ తోనూ, తెలుగులో ఎన్.టి. ఆర్( భలెతమ్ముడు) తోనూ, మళయాళంలో ప్రేమ్ నజీర్ తోనూపునర్నిర్మితమయ్యింది.
**********
ఐతే ఇది ఇక్కడితో ముగియలేదు.
చైనా టవున్ ఆధారంగా 1978 లో అమితాబ్ బచన్ హీరోగా వచ్చిన ‘డాన్’ సినిమా బొంబాయి మాఫియా నేపధ్యంలో సాగుతుంది.మాఫియా డాన్ పోలీసులకు నిద్రాహారాలు లేకుండాచేస్తున్నాడు. అతన్ని పట్టుకోవటం ఎవరివల్లా కావటం లేదు. కొన్ని ఆకస్మిక సంఘటనలతో ‘డాన్’ ఒక పోలీస్ అధికారికి దొరికాడు. మాఫియా మిగతావివరాలు చెప్పకుండానే అతను మరణించాడు. అదే సమయంలో ఆ పోలీసు అధికారికి ‘డాన్’ రూపురేఖలతో ఉన్న ఒక గ్రామీణయువకుడు కనిపించాడు.పోలీసు అధికారి అతన్ని ‘డాన్’ లా నేరప్రపంచానికి పంపాడు.
తర్వాత కథ ‘చైనాటవున్’ సినిమాలా తేలికగా ముగియలేదు.
మాఫియా లో ప్రవేశించిన వ్యక్తి , పోలీసులకు అవసరమైన కొంత పని చేసాక అతను ‘డాన్’ కాదని మిగతావారు తెలుసుకున్నారు. వారంతాఇతనిపై కక్షకట్టారు. ఒక్క పోలీసు అధికారికి తప్ప ఇతను’ డాన్’ కాడని మిగతా పోలీసులకు తెలియదు. వారంతా ఇతనిని డాన్ గానే భావిస్తున్నారు. అంతలో ఆ పోలీసు అధికారి మరణించాడు. ‘ డాన్’ రూపంలో ఉన్న యువకుడికి ఎటునుండీ రక్షణలేదు.అతను ఎలాబయటపడ్డాడన్నది తర్వాత కథ.
1978 ‘ డాన్’ సినిమా హైదరాబాద్ ‘taarakaraamaa ’థియేటర్ లో 75 వారాలపాటు నడిచింది . అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు. సినిమాలో అమితాబ్ నటన బాగాపండింది. పాటలు గొప్ప జనాదరణపొందాయి. వీటన్నింటితో పాటు సినిమా అసాధారణ విజయానికి కారణం మూలకథకు చేసిన ఒక జోడింపు. ఒక సామాన్యమానవుడు స్వార్ధరహితంగా సమాజానికి మేలుచేయబోయి ప్రాణాపాయంలోపడటం ఆ జోడింపు. సగటు ప్రేక్షకుడికి ఆ హ్యూమన్ ఎలిమెంటు గొప్పగా కనెక్ట్ అయ్యింది.
ప్రాంతీయభాషాచిత్రపరిశ్రమలకు మరో మంచి ఆధారం దొరికింది. 1979 లో ‘డాన్’ సినిమా తెలుగు లో ‘యుగంధర్’ పేరు తో రి-మేక్ అయ్యింది. చైనాటవున్ రిమేక్ ‘భలే తమ్ముడు’ లో నటించిన ఎన్.టి. ఆర్ పది సంవత్సరాల తర్వాత మఌ ‘డాన్’ రిమేక్ లోనూ నటించాడు.
1980 లొ తమిళంలో ‘ బిల్లా’ పేరుతో రజనీకాంత్ హీరో గా వచ్చి అతనికెరీర్ కు కొత్తఊపు ఇచ్చింది.
***********
ఈ సినిమా పట్ల నిర్మాతల ఆకర్షణ ఆ తర్వాతా తగ్గలేదు.
‘ డాన్’ (2006) పేరుతోనే షారుఖ్ ఖాన్ హీరోగా హిందీ లో వచ్చింది. దానికి కొనసాగింపుగా తమిళ్ లో మరొకసారి ‘బిల్లా’ (2007)పేరుతోనే ‘అజిత్’ హీరో గా వచ్చింది. 2009 లో తెలుగు లో ప్రభాస్ హీరోగా ‘ బిల్లా’ పేరు తో వచ్చింది. డాన్ కు సీక్వెల్ గా షారుఖ్ ఖాన్ తో డాన్ 2 (2011) వచ్చింది.
ఈ సినిమాలలో చాలావరకూ కమర్షియల్ గా పరవాలేదనిపించాయి.
సినిమాల అసాధారణవిజయాలను ఒక ప్రసిద్ధదర్శకుడు ‘ఆక్సిడెంట్’లతో పోల్చాడు. ‘అన్నీ’ కుదరటం ఆ ఆక్సిడెంట్ లకు కారణం కావచ్చు. ‘ డాన్’ 1978 అలాంటి ఒక ఆక్సిడెంట్.
‘డాన్’ సినిమాలో బాగా పాపులర్ ఐన డైలాగ్ “ డాన్ కో పకడ్ నా ముష్కిల్ నహీ! న మున్ కిన్ హై!”’ (డాన్ ని పట్టుకోవటం కష్టమే కాదు. అసాధ్యంకూడా!).
అలాచెప్పాలంటే “ ఔర్ ఏక్ ‘డాన్’ కో బనానా ముష్కిల్ నహీ! న మున్కిన్ హై!
-ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment