ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం మొదటి హిందీ పాట
ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం హిందీ సినిమాలకు పాడటం ఏక్ ధూజే కేలియే(1981) తో మొదలయ్యింది. ‘మరో చరిత్ర’ రిమేక్ గా ఎల్ వి ప్రసాద్ ,బాలచందర్, కమల్ హసన్ ల కాంబినేషన్ తో ఏక్ దూజే కేలియే తీసారు. ఎల్ వి ప్రసాద్ హిందీ సినిమాకు కొత్తకాదు. కానీ ఈ సినిమాను ఉత్తరభారత సినీ విమర్శకులు దక్షిణాది దండయాత్ర గా అభివర్ణించారు. బహుశా దర్శకుడు, కథానాయకుని తో పాటు ప్రధాన గాయకుడు కూడా దక్షిణాదివాడు కావటం, సినిమా విజయవంతం కావటం దానికి కారణం కావచ్చు.
ఏక్ దూజే కేలియే విజయం తర్వాత కొన్ని హిందీ సినిమాలకు పాడిన పూర్తిస్థాయి విజయం అతనికి ‘మైనె ప్యార్ కియా’ తో లభించింది. ఆ సినిమా సాధించిన అసాధారణ వ్యాపారవిజయంలో పాటల పాత్ర చాలాఉంది. ఆతర్వాత బాలు కమర్షియల్ సినిమాలలో పెద్దహీరోలకు, యువహీరోలకు చాలామందికి నేపధ్యగానం చేసాడు.బాలు పాడిన హిందీ పాటలు నాలుగువందలవరకూ ఉండవచ్చు.
****
బాలు పాటపాడిన మొదటిసినిమా ‘ఏక్ దూజే కేలియే’ కావచ్చు కాని అతనుమొదటపాడిన హిందీ పాట మాత్రం వేరే ఉంది.
‘మంచుకొండలు’(1981?) పేరుతో ఒక మలయాళీ సినిమా తెలుగులో కి డబ్ అయ్యింది. మిలటరీ నేపధ్యంలో సాగే ఆ సినిమాను కాశ్మీర్ తీసారు. అందులోని ఒకపాట తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. ప్రత్యేకంగా సిలోన్ రేడియోలో ( శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) వినపడేది. ఆ పాట మొదట హిందీతో మొదలై, హిందీ - తెలుగు చరణాలతో సాగుతుంది. “ సాథీ రే ప్యార్ జవా హై! బర్ఫీలా మస్త్ జమా హై!” అంటూ ఎస్ పి బాలు స్వరంతో మొదలౌతుంది. హిందీ భాగం ఎస్ పి బాలు , తెలుగు భాగం జి. ఆనంద్ పాడారు. కశ్మీర్ మంచుకొండల్లో చిత్రింపబడిన ఈ పాట సినిమాలో నూ బాగుంటుంది. వినటానికీ బాగుంటుంది. ‘ ఖయ్యాం’ సంగీతాన్ని గుర్తుచేస్తుంది.
మంచుకొండలు మలయాళమూలం ‘తుషారం’ సినిమా లో ఈ పాటను ఎస్. పి . బాలు (హిందీ), జేసుదాసు (మలయాళం) పాడారు. వీరిద్దరికాంబినేషన్ లో అరుదుగా వచ్చినపాటల్లో ఇదొక మంచిపాట. ప్రధాన గాయకులస్వరంతో తో పాటు కోరస్, వాద్యసంగీతం - కశ్మీర్ లోయల్లో ప్రతిధ్వనిస్తున్నట్టే కాదు ఎదలోయల్ని స్పృశిస్తున్న అనుభూతి కలుగుతుంది. సంగీత దర్శకుడు శ్యామ్ ( అంతిమతీర్పు సినిమాద్వారా తెలుగు వారికి పరిచితుడే)
ఈ పాట నాకు మరో రెండు పాటల్ని గుర్తుచేస్తుంది. ఒకటి 1978 లో వచ్చిన ‘ఏజెంట్ గోపి’ సినిమాలో (సత్యం సంగీత దర్శకత్వం) బాలు,సుశీల పాట ‘ ఓ.. హంస బలే రామ చిలకా’ ఐతే మరొకటి 1995 లో వచ్చిన దండోరా సినిమాలో ‘ కొండల్లో కోయిల పాటలు పాడాలి’ పాట.( వందేమాతరం శ్రీనివాస్ గానం
,సంగీతం).
No comments:
Post a Comment