మహమ్మద్ రఫీ-3
నేను కంప్యూటర్ ఉపయోగించేక్రమంలో ‘ఎమ్.ఎస్.యాక్సెస్’ నా ఉద్యోగ అవసరాలకు తగిన అప్లికేషన్ అని నిర్ధారించుకున్నాను. దానిని ప్రాక్టీస్ చేయటానికి నేను ఎంచుకున్న డేటాబేస్ ‘ మహమ్మద్ రఫీ పాడిన పాటలు. దఫ దఫాలుగా సేకరించిన వివరాలు టాబ్యులేట్ చేసి, సాధ్యమైనంతమేర వివరాలను సవరించి యాక్సెస్ టేబుల్ గా మార్చాను. అందులోని ఫీల్ద్స్ (కాలమ్స్) సినిమాలపేరు, సంవత్సరం, పాట పల్లవి, తోటి గాయనీ గాయకులు, సంగీత దర్శకుడు, గీతరచయిత, ఎవరిపైన చిత్రీకరింపబడినది, భాష, జానర్(తరహా) మొదలైనవి.. డేటాను ప్యూరిఫై చేయటం పెద్దపని అయ్యింది. వివరాల కరెక్ట్ నెస్ ఒక భాగమైతే, స్పెల్లింగ్ అనేది మరోభాగం. ఉదాహరణకు ఒకే సంగీత దర్శకునిపేరు అతనికి సంబంధించిన అన్నిచోట్లా ఒకేరకమైన స్పెల్లింగు తో ఉండటం (పేరు మధ్యనున్న గాప్స్ తో సహా) వంటివి. ఇది అన్ని ఫీల్డ్స్ కు వర్తిస్తుంది.
ఫైనల్ గా ఐదువేల మూడువందల అరవై ఎనిమిది ‘రోస్’, పది ‘ఫీల్డ్స్’ తో ఉన్న రఫీ పాటల డేటాబేస్ తయారయ్యింది. దీనిని ఆధారం చేసుకుని వివిధరకాలైన కాంబినేషన్లలో డేటాను అనలైజ్ చేయవచ్చు. రకరకాల ‘క్వెరీ’లు రాయటం, ‘ఫార్మ్’లు సృష్టించటం, ‘రిపోర్టు’ లు రాయటం ప్రాక్టీస్ చేసాను.
స్వామికార్యం( ఆఫీస్కు అవసరమైన నా స్కిల్ సెట్ పెరగటం), స్వకార్యం(ముప్ఫైఆరేళ్ళపాటు సాగిన రఫీ గానవాహినిని దగ్గరగా చూడగలగటం) రెండూ దీనివల్ల సిద్ధించాయి.
******
“ ప్రతీ ఒక్కరూ ఏదోఒకటి అమ్ముకుంటూనే జీవిస్తారు “ అనేది రాబర్ట్ లూయిస్ స్టీవెన్ సన్ ప్రసిద్ధమైన కోట్.అంటే అందరూ ఏదో ఒకవ్యాపారంలో మునిగిఉంటారు. అందరికీ తమదైన ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ కి లైఫ్ సైకిల్ ఉంటుంది. రఫీ గానాలాపన అతని ప్రాడక్ట్. దాని లైఫ్ సైకిల్ ను కింది చూడవచ్చు.
******
1980 వరకూ వచ్చిన మేల్ సింగర్స్ పాడిన హిందీపాటలలో 50% రఫీనే పాడారు. సైగల్,తలత్ మెహమూద్, హేమంత్ కుమార్, ముకేశ్, మన్నాడే, కిషోర్ కుమార్,మహేంద్రకపూర్ వంటివారు తోటిగాయకులుగాఉన్న కాలమది. ఒకరకంగా మోనోపలి. రఫీ రికార్డింగ్ కు అందుబాటు లేకుంటేనే తనబోటి మిగతావారికి పాడే అవకాశం లభిస్తుందని ముకేశ్ ఒక సారి ‘చమత్కరించా’డని అంటారు. తలత్ మహమూద్ రఫీ పట్ల తన అసహనాన్ని కొన్నిసార్లు వ్యక్తం చేసాడు. 69/70ల లో తెలుగులోపాటలు పాడటానికి వచ్చిన రFఇకి ఘంటసాల ఆతిధ్యమిచ్చాడు. ‘తనకుపాటకు వెయ్యి ఇవ్వటానికి ఆలోచిస్తారు, బైటవారిని పిలిచి ఐదు వేలు ఇస్తారు’ అని ఘంటసాల ఆంతరంగికులతో అన్నారని చదివాను. రఫీ పాటల సంఖ్య అతని సంపాదననూ తెలియజేస్తుంది. దానివల్లే అరవైలలోనే తన పిల్లలను లండన్ లో చదివించగలిగాడు, స్థిరపరచగలిగాడు. బెర్క్ షైర్ లో క్వీన్ ఎలిజబెత్ నివాసముండే విండ్సర్ కాజిల్ కు కొన్ని నిముషాల దూరంలో రఫీ కుటుంబం నివసించింది.
********
రఫీ బ్రతికిఉన్నపుడు అతని జీవిత చరిత్ర రాలేదు. మరణం కూడా రెలేటివ్ గా చిన్నవయసులో సంభవించింది. అతని జీవితం తెరిచినపుస్తకంకాదు. తర్వాతికాలంలో అతనిపై వచ్చిన పుస్తకాలలో అతని మానసిక స్థితిగతులను చర్చించినవిలేదు.ఉన్నంతలో అతని కోడలు ‘యాస్మిన్ ఖాలిద్ రఫీ’ రాసిన ‘ మొహమ్మద్ రఫీ-మై అబ్బా- ఎ మెమ్మొయిర్’ ద్వారా కొన్ని వివరాలు తెలుస్తాయి. కెరీర్ లో మెజారిటీ కాలం మొనాపలీ అనుభవించిన రఫీ కి ఒడిదుడుకులు, క్లిష్టసందర్భాలు లేవా? ఉన్నవనే కొందరు చెబుతారు. ప్రత్యేకంగా 70-75 ప్రాంతాలలో అతడు ఒత్తిడికి లోనయ్యాడంటారు. అది వృత్తిపరంగానే కాక, మతపరమైనదిగానూ చెబుతారు. హజ్ యాత్ర చేసిన తర్వాత తన వృత్తి మతధర్మానికి విరుద్ధమైనదేమోనని సంఘర్షణకు లోనయ్యాడు. అతను చేసిన చారిటీలను మతపెద్దలు నిరాకరించటం అతనిని బాధించింది. ఆసమయంలో ఎక్కువకాలం అతను లండన్ లో కుటుంబ సభ్యులతో గడిపాడు. అప్పటి వివరాలు ‘ మొహమ్మద్ రఫీ-మై అబ్బా- ఎ మెమ్మొయిర్’లో ప్రస్తావితమయ్యాయి. ఆవివరాలను పరిగణనలోకి తీసుకుంటే అతని వృత్తిపరమైన వెనుకబాటు అతన్ని పెద్దగాబాధించినట్టు కనపడదు.
-ముళ్ళపూడి సుబ్బారావు
No comments:
Post a Comment